బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి

బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాతగా యావత్‌ భారత జాతి పిలుచుకునే ప్రసిద్ధ వ్యక్తి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌. ఈయన ఒక మార్గదర్శక నాయకుడు, సాంఘిక సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి, సామాజిక వివక్షను అధిగమించి, స్వశక్తితో ఎదిగి తాను అర్జించిన జ్ఞానాన్ని దేశ పౌరుల అభ్యున్నతి కోసం ధారపోసిన వ్యక్తి ఈయన. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయం, సమానత్వాన్ని ప్రోత్సహించే సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పోటీ పరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!

బాల్యం - తొలి జీవితం..

  • పూర్తి పేరు భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌. 1891, ఏప్రిల్‌ 14న ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జన్మించారు. తండ్రి రామ్‌జీ మలోజీ సక్పాల్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌ కాగా తల్లి భీమాబాయి గృహిణి. నాటి సమాజంలోని కఠిన కుల వ్యవస్థ కారణంగా వీరి కుటుంబం సామాజిక వివక్షను ఎదుర్కొంది.
  • 1896లో వారి కుటుంబం మహారాష్ట్రలోని సతారాకు వలస వెళ్లింది. అంబేడ్కర్‌ 1897లో స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ ఉన్నత పాఠశాలలో చేరారు. అందులో చేరిన ఏకైక దళిత విద్యార్థిగా నిలిచారు. స్కూల్‌లోనూ ఆయనపై వివక్ష కొనసాగింది. విద్యార్థులతో కలిసి కాకుండా పాఠశాల గది బయట విడిగా కూర్చోబెట్టేవారు. అందరితోపాటు నీరు తాగేందుకు కూడా ఆయన్ను అనుమతించేవారు కాదు. ఈ సంఘటనలన్నీ ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. సామాజిక వివక్షను ఎదుర్కోవాలంటే చదువే మార్గమని ఆయన భావించారు.
  • 1907లో మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసి, ఎల్ఫిన్‌స్టోన్‌ కాలేజీలో చేరిన తొలి దళిత వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. 1912లో అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రంలో బీఏ పట్టా పొందారు.
  • బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్‌ అందించిన స్కాలర్‌షిప్‌ సాయంతో 1913లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. 1915లో అర్థశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు.  
  • బరోడా మహారాజు స్కాలర్‌షిప్‌ ముగిశాక ఆయన 1917లో భారత్‌కు తిరిగి వచ్చారు. కొల్హాపూర్‌ ఛత్రపతి షాహూజీ మహరాజ్‌ అందించిన ఆర్థిక సాయంతో అంబేడ్కర్‌ ఇంగ్లండ్‌ వెళ్లి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేరారు. అక్కడ ప్రఖ్యాత బ్రిటిష్‌ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎడ్విన్‌ కానస్‌ వద్ద విద్య అభ్యసించారు. 1921లో అర్థశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు.   

అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని..

  • అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అంబేడ్కర్‌ 1924, జులై 20న బొంబాయిలో ‘బహిష్కృత్‌ హితకారిణి సభ (Outcastes Welfare Association)’ను నెలకొల్పారు.  
  • మహద్‌ పురపాలక సంఘంలోని చౌదర్‌ చెరువులోని నీటి వనరులపై దళితులకు హక్కులను సాధించడమే లక్ష్యంగా 1927, మార్చి 20న ‘మహద్‌ సత్యాగ్రహాని’కి నాయకత్వం వహించారు.
  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కలారామ్‌ ఆలయంలోకి అణగారిన వర్గాలకు ప్రవేశం కల్పించాలనే లక్ష్యంతో 1930, మార్చి 2న ‘కలారామ్‌ ఆలయ సత్యాగ్రహాన్ని’ ప్రారంభించారు.
  • 1932 నాటి పుణె ఒడంబడికలో అంబేడ్కర్‌ కీలకపాత్ర పోషించారు. శాసనసభ ఎన్నికల్లో అణగారిన వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యంతోపాటు రిజర్వ్‌ సీట్లను కల్పించడానికి అంబేడ్కర్, గాంధీజీ మధ్య ఒప్పందం కుదిరింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram