భారత్లోని ఉద్యోగుల్లో 96% మంది రోజూ లేదా వారానికి 2-3 సార్లు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక తెలిపింది. 9 ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో ఇదే అత్యధికం. దీనివల్ల ఉద్యోగులకు వారానికి సగటున 15 గంటల సమయం ఆదా అవుతోందని వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ (అపాక్)లో ఏఐని ఉపయోగించే ఉద్యోగుల వాటా 85 శాతంగా ఉందని ‘ఫర్ ఆసియా-పసిఫిక్, స్ట్రాటజిక్ క్లారిటీ ఈజ్ ది కీ టు వాల్యూ’ పేరుతో విడుదల చేసిన నివేదికలో బీసీజీ పేర్కొంది. దీని ప్రకారం..
ఏఐ వల్ల అపాక్లో ఉద్యోగులకు వారానికి సగటున 9.4 గంటలు ఆదా అవుతుంటే, భారతీయ ఉద్యోగులకు వారానికి 15 గంటలు ఆదా అవుతున్నాయి. భారత్లోని ఉద్యోగుల్లో 61% మంది, ఏఐ ద్వారా ఆదా అయిన సమయాన్ని అదనపు వ్యూహాత్మక పనుల కోసం ఉపయోగిస్తున్నారు. అపాక్లో ఇది 44 శాతంగా ఉంది. ఈ విషయంలో భారత్ 9 మార్కెట్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (60%), చైనా (37%) ఉన్నాయి.