దేశంలో నేరాల సంఖ్య 2024 సంవత్సరంలో అంతకు ముందు సంవత్సరంతో (2023) పోలిస్తే ఆరు శాతం మేరకు తగ్గిపోయినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2026, మే 6న ప్రకటించింది. 2023 సంవత్సరంలో దేశంలో మొత్తం 62.41 లక్షల నేరాలు నమోదు కాగా ఆ సంఖ్య 2024లో 58.85 లక్షలకు పడిపోయిందని బ్యూరో వెల్లడించింది.
‘గాయాల’ కేటగిరీ కింద నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా 30.58 శాతం తరుగుదల నమోదైంది. ఈ కేసుల సంఖ్య 2023లో 6.36 లక్షలు కాగా 2024లో వాటి సంఖ్య 4.41 లక్షలకు తగ్గిపోయింది. గాయాల కేసుల్ని నాన్ కాగ్నిజబుల్ నేరంగా మార్చి వేయడంతో ఈ కేటగిరీ కింద నమోదైన కేసుల సంఖ్య తగ్గిపోయిందని బ్యూరో పేర్కొంది. 2024లో మొత్తం 27,049 హత్య కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4 శాతం తక్కువ.