మార్కెట్ విలువ పరంగా ప్రపంచ అగ్రగామి-100 కంపెనీల జాబితాలో మనదేశం నుంచి ఒక్క కంపెనీ కూడా లేకుండా పోయింది. కొన్ని దేశాల కంపెనీల మార్కెట్ విలువ బాగా పెరగడం, ఇదే సమయంలో మన కంపెనీల విలువ తగ్గడం ఇందుకు కారణం. 2025 ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ అంతర్జాతీయంగా అగ్రగామి-100 కంపెనీల్లో స్థానం కలిగి ఉన్నాయి. 2026లో మన స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతుండటంతో, షేర్ల ధరలు దిగి వస్తున్నాయి. ఫలితంగా కంపెనీల మార్కెట్ విలువ పడిపోతోంది.
2026, జనవరిలో రూ.21.62 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.17.89 లక్షల కోట్లు మాత్రమే. 2025 ప్రపంచ అగ్రగామి కంపెనీల్లో 57వ ర్యాంకులో ఉన్న రిలయన్స్, 2026 ప్రారంభంలో 73వ స్థానానికి తాజాగా 106వ స్థానానికి పడిపోయింది.