ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం

ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం

భూమిపై మానవుల అవసరాలను తీర్చడంలో ఉపగ్రహాలు కీలక పాత్ర  పోషిస్తున్నాయి. ఇవి దేశప్రయోజనాలు, వ్యక్తిగత అవసరాలు, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ - సద్వినియోగం, వాతావరణ ముందస్తు సమాచారం లాంటివెన్నో నిర్వహిస్తున్నాయి. శాటిలైట్‌ టెక్నాలజీలో భారతదేశం సాధించిన పురోగతికి గుర్తుగా ఏటా ఏప్రిల్‌ 19న ‘ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం’గా (Satellite Technology Day) నిర్వహిస్తారు. ఉపగ్రహ సాంకేతికత సాయంతో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడం, అంతరిక్ష రంగంపై వారిని చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఉపగ్రహాలు అంటే?

  • ఏదైనా ఖగోళ వస్తువు చుట్టూ పరిభ్రమించే పెద్ద వస్తువును ఉపగ్రహం అంటారు. వీటిలో సహజ, కృత్రిమ అని రెండు రకాలు ఉంటాయి. సూర్యుడికి భూమి; భూమికి చంద్రుడు సహజ ఉపగ్రహాలు. కొన్ని నిర్దిష్ట విధులను నిర్వర్తించడానికి మానవుడు రాకెట్ల సాయంతో కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాడు. ఇవి సమగ్ర పరికరాలతో కూడి భూమి, ఇతర గ్రహాల అధ్యయనానికి; సమాచార ప్రసారానికి, రక్షణ అవసరాలకు, వాతావరణ అంశాల పరిశీలన సహా సుదూర విశ్వాన్ని పరిశీలించడానికి సాయం చేస్తాయి.
  • ఈ ఉపగ్రహాలు ఆకాశంలో చాలా ఎత్తులో  ప్రయాణిస్తాయి. వాటి సాయంతో భూమిపై ఉండే విశాల ప్రాంతాలను; మానవుడు వెళ్లలేని ప్రదేశాలను చూడొచ్చు. అలాగే వీటి సాయంతో భూమికి ఆవల ఉన్న అంతరిక్షాన్ని కూడా తెలుసుకోవచ్చు.
  • వీటి సాయంతో సుదూర ప్రాంతాలకు ఫోన్‌ కాల్స్, టీవీ ప్రసారాలు, జీపీఎస్‌ - నావిగేషన్‌ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాయి. 

ఉపగ్రహాలు - రకాలు

  • ఉపగ్రహాలను వాటి కక్ష్యల ఆధారంగా వివిధ రకాలుగా విభజించారు. అవి:
  • తక్కువ భూ కక్ష్య ఉపగ్రహాలు (Low Earth Orbit satellites): భూమి ఉపరితలం నుంచి సుమారు 100 - 1000 స్టాట్యూట్‌ మైళ్ల (సుమారు 160 నుంచి 1600 కి.మీ.) ఎత్తులో ఉంటాయి.
  • ఇవి సెకనుకు సుమారు 7.8 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి వీటిని దాదాపు 90 నిమిషాలు పడుతుది.
  • భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఇవి అధిక రిజల్యూషన్‌ ఇమేజింగ్, తక్కువ లేటెన్సీ కమ్యూనికేషన్లను అందిస్తాయి.

ఉదా:

1.బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహం: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ - షార్‌ నుంచి 2025, డిసెంబరు 24న బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని ఇస్రో
నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీని బరువు  6,100 కిలోలు. అత్యంత శక్తిమంతమైన బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం6 దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ రూపొందించిన అత్యంత బరువైన బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని ఇస్రో 518.5 కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నాణ్యమైన వాయిస్, డేటా, వీడియో సేవలకు దీన్ని ప్రయోగించారు.

మధ్యస్థ భూ కక్ష్య (Medium Earth Orbit) ఉపగ్రహాలు: భూమికి 2000 కి.మీ. నుంచి 35,786 కి.మీ. ఎత్తులో పనిచేస్తాయి. వీటిని ప్రధానంగా నావిగేషన్‌ (జీపీఎస్, గెలీలియో, జీఎల్‌ఓఎన్‌ఏఎస్‌ఎస్‌), మధ్యస్థ-లేటెన్సీ సమాచార ప్రసారం కోసం ఉపయోగిస్తారు. వీటి కక్ష్యా కాలం 2 నుంచి 12 గంటలు.

ఉదా:

1. జీపీఎస్‌ (నావ్‌స్టార్‌): అమెరికా నిర్వహించే ఈ ఉపగ్రహాలు సుమారు 20,200 కి.మీ. ఎత్తులో పనిచేస్తూ భారతదేశమంతటా కచ్చితమైన నావిగేషన్ సిగ్నల్స్‌ అందిస్తాయి

2. గెలీలియో: ఈ యూరోపియన్‌ నావిగేషన్‌ వ్యవస్థ సుమారు 23,222 కి.మీ. ఎత్తులో ఉంటూ, భారతదేశానికి కచ్చితమైన పీఎస్‌టీ (పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్‌) డేటాను అందిస్తాయి.

భూస్థిర కక్ష్య (Geostationary Orbit) ఉపగ్రహాలు: ఇవి భూమి నుంచి సుమారు 35,786 కి.మీ.కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. టీవీ ప్రసారాలు, వాతావరణ పర్యవేక్షణ, సమాచార ప్రసారానికి ఇవి అనువైనవి. ఇవి భూమి తన చుట్టూ తాను తిరిగే దిశలోనే అదే వేగంతో పరిభ్రమిస్తాయి.

ఉదా:

ఇన్‌శాట్‌-3 డీఎస్‌: ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 వాహకనౌక ద్వారా ఇన్‌శాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని 2024, ఫిబ్రవరి 17న ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 2,275 కిలోల ఇన్‌శాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం వాతావరణాన్ని, భూమి, సముద్ర ఉపరితలాలను మరింత మెరుగ్గా  పరిశీలిస్తుంది. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్‌ (ఎస్‌ఎస్‌ఓ) శాటిలైట్స్‌: ఇవి భూ ఉపరితలంపై ఏదైనా నిర్దిష్ట బిందువు మీదుగా ఒకే స్థానిక సగటు సౌర సమయంలో ప్రయాణించేలా రూపొందించారు. సాధారణంగా 600 నుంచి 800 కి.మీ. ఎత్తులో తిరుగుతూ ఉంటాయి. రిమోట్‌ సెన్సింగ్‌ కోసం; ప్రత్యేకంగా భూమి, పర్యావరణ పరిశీలన కోసం వీటిని ఉపయోగిస్తారు.

  • ఇవి దాదాపు ధ్రువాల మీదుగా లేదా వాటికి సమీపంలో  ప్రయాణిస్తాయి. భూమి భ్రమణంతో సమానంగా వెళ్తూ దాదాపు మొత్తం భూ ఉపరితలాన్ని ఇవి కవర్‌ చేస్తాయి.

ఉదా:

సరళ్‌ (SARAL - Satellite with ARgos and ALtiKa): దీన్ని 2013, ఫిబ్రవరి 25న పీఎస్‌ఎల్వీ-సి20 రాకెట్‌ సాయంతో అంతరిక్షంలోకి ప్రయోగించారు. భారత్, ఫ్రాన్స్‌ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. దీని సాయంతో సముద్ర ఉపరితల స్వరూప స్వభావాలను తెలుసుకోవచ్చు. 

జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీఓ) శాటిలైట్‌: జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ అనేది ఒక దీర్ఘవృత్తాకార, మధ్యంతర కక్ష్య. దీన్ని ఉపగ్రహాలను ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌’ నుంచి ‘జియోస్టేషనరీ ఆర్బిట్‌’కు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది శక్తిని ఆదా చేసే మధ్యంతర దశగా పనిచేస్తుంది.

  • ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని నిరంతరం వీక్షించాల్సిన అవసరం ఉన్న కమ్యూనికేషన్, ప్రసార, వాతావరణ ఉపగ్రహాల కోసం వీటిని ఉపయోగిస్తారు. 

ఉదా:

1. జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం: భారత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్‌-ఎన్‌2.. 2024, నవంబరు 19న విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరింది. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లగల రాకెట్‌ భారత్‌ వద్ద లేకపోవడంతో విదేశీ సంస్థపై ఆధారపడాల్సి వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వద్ద ఉన్న శక్తిమంతమైన రాకెట్‌ ఎల్‌వీఎం-3కి 4వేల కిలోల బరువైన ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం మాత్రమే ఉంది. ఇస్రోకు, ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు మధ్య ఇదే తొలి వాణిజ్య భాగస్వామ్యం. 

చారిత్రక నేపథ్యం..

  • భారతదేశ మొదటి ఉపగ్రహమైన ‘ఆర్యభట్ట’ను 1975, ఏప్రిల్‌ 19న రష్యా వాహక నౌక ఇంటర్‌ కాస్మోస్‌ సీ-1 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్‌ బరువు 360 కిలోలు. దీన్ని ప్రొఫెసర్‌ యూఆర్‌.రావు నిర్మించారు. ఇస్రో దీన్ని X-Ray ఆస్ట్రానమీ, సోలార్‌ ఫిజిక్స్‌ లాంటి అంశాల పరిశోధనల కోసం రూపొందించింది. 
  • ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఏటా ఏప్రిల్‌ 19న ‘ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం’గా జరుపుకోవాలని 2000లో ఇస్రో తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కిందివాటిలో భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఏది?(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2022),(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఎల్‌ఎస్‌ఐ, ఫారెస్టర్‌ అండ్‌ ఫారెస్ట్‌ గార్డ్, 2024)

1) కాలిస్టో          2) హైడ్రా         3) టైటాన్‌          4) చంద్రుడు

సమాధానం: 4

2. ఉపగ్రహం అంటే?(ఎంపీ మహిళా సూపర్‌వైజర్, 2017)

1) కృత్రిమ వస్తువు    

2) ఊహాజనిత వస్తువు

3) సహజ వస్తువు    

4) ఎలక్ట్రానిక్‌ వస్తువు

సమాధానం: 1

3. ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించాక, దాని చలనాన్ని నియంత్రించే ఏకైక బలం ఏది?(ఎస్‌ఎస్‌సీ సీపీఓ, 2019)

1) గురుత్వాకర్షణ శక్తి    

2) స్థితిస్థాపకత

3) ఘర్షణ            

4) ఏదీకాదు

సమాధానం: 1

4. The Indian Space Research Organisation (ISRO) celebrated its 55th foundation day on 15 August 2024 by launching which of the following satellites? (RRB JE CBT-I 2024)

1) EOS-04          2) EOS-08  

3) EOS-06          4) EOS-07

Answer: 2

5. When was the Indian National Satellite System (INSAT), a multipurpose satellite system for telecommunications, established?(RPF Constable 2025)

1) 1983           2) 1988           3) 1976          4) 1994

Answer: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram