ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో భారత్ నుంచి ఈసారి 3,898 మంది చోటు సంపాదించారు. వారందరూ దేశంలోని 1,185 విద్యా, పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం-ఎల్సెవియర్ గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ జాబితాను విడుదల చేస్తోంది. 2026 జాబితాను తాజాగా ప్రచురించింది.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు, ఆల్ ఇండియా ఆఫ్తాల్మాలాజికల్ సొసైటీ(ఏఐవోఎస్) గౌరవ కార్యదర్శి డాక్టర్ సంతోష్ జి.హొనావర్ వరుసగా అయిదోసారి ప్రపంచ టాప్-2 శాతం ప్రతిష్ఠాత్మక శాస్త్రవేత్తల జాబితాలో చోటు పొందారు.
అలాగే కెరీర్ లాంగ్ పరిశోధన ప్రభావం విభాగంలోనూ ఆయన మొదటిస్థానంలో నిలిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సైట్ ఆసుపత్రిలో ఆఫ్తాల్మిక్ ప్లాస్టిక్ సర్జరీ, ఓక్యులర్ ఆంకాలజీ విభాగాల డైరెక్టర్‌గా ఉన్న హోనావర్, గతంలో ఎల్వీప్రసాద్ వైద్య సంస్థ అసోసియేట్ డైరెక్టర్‌గా, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ సంపాదకుడిగా పనిచేశారు.