అమెరికాలో యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్ల/రూ.9500 కోట్ల విలువైన) స్థాయికి చేరిన అంకుర సంస్థలను స్థాపించిన విదేశీ వలసదారుల జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్తలు అగ్రస్థానంలో నిలిచారని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) అధ్యయనం తెలిపింది. ‘ఇమిగ్రెంట్ అండ్ యూఎస్ బిలియన్ డాలర్ కంపెనీస్’ పేరిట ఈ నివేదిక వెలువడింది.
అమెరికాలో ఏర్పాటై, యూనికార్న్‌లుగా ఎదిగిన సంస్థల వ్యవస్థాపకుల్లో భారతీయులు (96 కంపెనీలు) అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఇజ్రాయెల్ (60 యూనికార్న్‌లు), యూకే (47), చైనా (41), కెనడా (30), రష్యా (23), ఫ్రాన్స్ (21), జర్మనీ (18), ఉక్రెయిన్ (16), ఆస్ట్రేలియా (14), పాకిస్థాన్ (10), రొమేనియా (10) నిలిచాయి.