దేశంలోని పర్యాటక ప్రాంతాల విశేషాలతో నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల గురించి దేశ, విదేశీ పర్యాటకులకు అధీకృతంగా తెలిపేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబరు వరకు వివిధ రాష్ట్రాల్లో నెలల వారీగా పర్యాటక ప్రాధాన్యాన్ని వివరించింది. ప్రపంచ ప్రసిద్ధ ‘లోన్లీ ప్లానెట్ ట్రావెల్ బుక్’ తరహాలో నీతి ఆయోగ్ దీన్ని రూపొందించింది. మొత్తం 498 పేజీల నివేదికలో ఏపీకి 13 పేజీలు కేటాయించింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు మంచి సమయమని పేర్కొంది. ఆ సమయంలో వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుందని తెలిపింది. సంప్రదాయ కూచిపూడి, విలాసిని నాట్యానికి ఏపీ కేంద్రమని వర్ణించింది.
తెలంగాణ విషయానికొస్తే..
తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్యకాలం అనుకూలంగా ఉంటుందని ద్యిభారత్ నివేదిక పేర్కొంది. మొత్తం 498 పేజీల ఈ నివేదికలో తెలంగాణకు ఏడు పేజీలు కేటాయించింది. రాష్ట్రంలోని ప్రాంతాలను ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న ప్రాంతాలుగా విభజించి పొందుపరిచింది.