స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) రిజర్వేషన్లపై ప్రభుత్వం 2026, అక్టోబరు 10న ఉత్తర్వులు వెలువరించింది. రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ (డెడికేటెడ్ కమిషన్) నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సగటున 28.18 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తంగా బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు వర్తించేలా కూటమి పార్టీల తరఫున అవకాశాలివ్వాలని నిర్ణయించింది.
డెడికేటెడ్ కమిషన్ 7 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వివిధ సామాజికవర్గాల నుంచి సమాచారం సేకరించింది. దీని ఆధారంగా స్థానిక సంస్థల వారీగా బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ సమర్పించిన నివేదికలోని సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తదుపరి చర్యల కోసం ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది.