ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్‌సీడీ ఎపిడెమియాలజీ (నైన్) సంస్థ ఇటీవల ‘ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్- 2026’ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే అధికమని ఇది పేర్కొంది.
విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు సహా 12 ఆసుపత్రుల క్యాన్సర్ రిజిస్ట్రీ నెట్‌వర్క్ సమాచారం ఆధారంగా 2017-18 నాటి పరిస్థితులు.. 2026, 2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశాలను అంచనా వేసింది. రాష్ట్రంలో 2026లో 64,990 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అంచనా వేసింది. వీటిలో పురుషుల్లో 29,344.. మహిళల్లో 35,646 కేసులు ఉంటాయని పేర్కొంది. 2030లో రాష్ట్రంలో క్యాన్సర్ కొత్త కేసులు 65,458 పెరుగుతాయని అంచనా వేసింది.