ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

శాంతి స్వరూప్‌ భట్నాగర్‌

శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ దేశంలో శాస్త్రీయ పరిశోధనకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో పరిశోధన, అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) సహా 12 జాతీయ ప్రయోగశాలలను నెలకొల్పడంలో ఎంతో కృషి చేశారు.


భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ఒకరు. రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. అయస్కాంతత్వం, ఎమల్షన్లపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల ద్వారా మిశ్రమాలు (Alloys), కొల్లాయిడ్లు, అయోడిన్, మెర్క్యురీ, సెలీనియం మూలకాల పరమాణుతత్వాన్ని కనుక్కున్నారు. అంతేకాక దేశంలో శాస్త్రీయ పరిశోధనకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో పరిశోధన, అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) సహా 12 జాతీయ ప్రయోగశాలలను నెలకొల్పడంలో భట్నాగర్‌ ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన్ను పరిశోధనాశాలల పితామహుడిగా (Father of Research Laboratories) పేర్కొంటారు. దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధి చెందాలని స్వాతంత్య్రానికి పూర్వమే ఆలోచించి.. ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేసిన ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ గురించి తెలుసుకుందాం..!

  • శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ 1894, ఫిబ్రవరి 21న పంజాబ్‌లోని బెహ్రా (ప్రసుత పాకిస్థాన్‌)లో జన్మించారు. తండ్రి పరమేశ్వరి సహాయ్‌ భట్నాగర్‌ చిన్నతనంలోనే మరణించడంతో, తన తాతయ్య మున్షి ప్యారేలాల్‌ వద్ద పెరిగారు. ఆయన ఇంజినీర్‌ కావడంతో భట్నాగర్‌కు సైన్స్‌ పట్ల ఆసక్తి కలిగింది.
  • 1919లో లాహోర్‌లోని ఫోర్మాన్‌ క్రిస్టియన్‌ కళాశాలలో ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. 1921లో లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ పొందారు. అదే ఏడాది భారత్‌కు తిరిగి వచ్చి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో (బీహెచ్‌యూ) అధ్యాపకుడిగా చేరారు. ఆ సమయంలో ఆయన బీహెచ్‌యూ కోసం ప్రత్యేకంగా ‘కుల్గిత్‌’ అనే గీతాన్ని రాశారు. అది యూనివర్సిటీ అధికారిక గేయంగా నేటికీ వాడుకలో ఉంది. 1924-40 వరకు ఆయన పంజాబ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన యూనివర్సిటీ కెమికల్‌ ల్యాబొరేటరీస్‌కి డైరెక్టర్‌గా పనిచేశారు.
  • కె.ఎన్‌.మాధుర్‌తో కలిసి ఆయన ‘ఫిజికల్‌ ప్రిన్సిపల్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ మాగ్నిటో కెమిస్ట్రీ’ అనే పుస్తకాన్ని రచించారు.
  • ఈయన 1955, జనవరి 1న మరణించారు.

పరిశోధనలు..

  • పంచదార ఉత్పత్తి కోసం చెరకు రసాన్ని వాడాక మిగిలిన పిప్పిని (బగాస్‌) పశువులకు ఆహారంగా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఇది భట్నాగర్‌ సాధించిన మొదటి పారిశ్రామిక సమస్య.
  • డ్రిల్లింగ్‌ ద్వారా మడి చమురును వెలికితీసే క్రమంలో మట్టి, నీరు కలిసి బురదగా మారి డ్రిల్‌ రంధ్రాలను మూసుకునేలా చేసేవి. కొల్లాయిడల్‌ కెమిస్ట్రీ ద్వారా ఈ సమస్యలను ఆయన పరిష్కరించారు.
  • రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికుల కోసం ప్రత్యేకంగా యాంటీ గ్యాస్‌ క్లాత్‌ను రూపొందించారు.
  • కె.ఎన్‌.మాధుర్‌తో కలిసి భట్నాగర్‌ 1928లో భట్నాగర్‌ - మాధుర్‌ మాగ్నటిక్‌ ఇంటర్ఫెరెన్స్‌ బ్యాలెన్స్‌ను కనుక్కున్నారు. ఇది అయస్కాంత లక్షణాలను కొలిచే పరికరం. 1931లో దీన్ని రాయల్‌ సొసైటీలో ప్రదర్శించారు.

చేపట్టిన పదవులు..

  • 1942-54 వరకు సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు.
  • 1947-48లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు.
  • 1951లో ఏర్పాటైన సహజ వనరులు, శాస్త్రీయ పరిశోధన మంత్రిత్వ శాఖకు మొదటి కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • 1953లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసి)కి మొదటి ఛైర్మన్‌గా పనిచేసి, దేశంలో ఉన్నత విద్య పురోగతికి తోడ్పడ్డారు.

అవార్డులు..

  • 1936లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’ను ప్రదానం చేసింది.
  • 1941లో బ్రిటిష్‌ ప్రభుత్వం ‘నైట్‌’ బిరుదు ఇచ్చింది.
  • 1943లో ‘రాయల్‌ సొసైటీ ఫెలో’గా ఎన్నికయ్యారు.
  • 1954లో భారత ప్రభుత్వం ఆయన్ను ‘పద్మవిభూషణ్‌’తో సత్కరించింది.

శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం..

  • సీఎస్‌ఐఆర్‌ మొదటి డైరెక్టర్‌ జనరల్‌ శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పేరిట 1957లో ఈ అవార్డును నెలకొల్పారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో ప్రతిభ కనబరచిన 45 ఏళ్ల లోపు శాస్త్రవేత్తలకు దీన్ని అందిస్తారు. దీని కింద రూ.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం ఇస్తారు.

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram