ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

జాన్‌ డాల్టన్‌

జాన్‌ డాల్టన్‌ భౌతిక, రసాయన, వాతావరణ శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించిన అణు సిద్ధాంతం పదార్థ స్వభావం గురించిన శాస్త్రీయ సిద్ధాంతంగా పేరొందింది. అణువుల రూపంలో పదార్థాన్ని అధ్యయనం చేసిన మొదటి సిద్ధాంతం ఇది.


జాన్‌ డాల్టన్‌ భౌతిక, రసాయన, వాతావరణ శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించిన అణు సిద్ధాంతం పదార్థ స్వభావం గురించిన శాస్త్రీయ సిద్ధాంతంగా పేరొందింది. అణువుల రూపంలో పదార్థాన్ని అధ్యయనం చేసిన మొదటి సిద్ధాంతం ఇది. ఆయనకు వర్ణ అంధత్వం ఉంది. దీనిపై పరిశోధనలు చేసిన తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. అందుకే తర్వాతి కాలంలో ఆయన గౌరవార్థం దాన్ని ‘డాల్టోనిజం’ అని పిలుస్తున్నారు. వాయువులపై రిసెర్చ్‌ చేసి ‘డాల్టన్స్‌ లా’ను కనుక్కున్నారు. రసాయన చిహ్నాల వ్యవస్థను రూపొందించారు. సాపేక్ష బరువుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సెప్టెంబరు 6న ఈయన జయంతి సందర్భంగా ఈయన జీవితంలోని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - కెరీర్‌:

• జాన్‌ డాల్టన్‌ 1776, సెప్టెంబరు 6న ఇంగ్లండ్‌లోని ఈగల్‌ఫీల్డ్స్‌ గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన తెలివితేటల్లో దిట్ట. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. సైన్స్, గణితం, ఇంగ్లిష్‌లో పట్టు సాధించారు. ఈయనకు వాతావరణశాస్త్రం (మెటీరియాలజీ)పై ఎక్కువ ఆసక్తి ఉండేది. దీంతో పరిశీలనకు కావాల్సిన పరికరాలను స్వయంగా తయారుచేసుకున్నారు. గ్రీకు, లాటిన్‌ భాషలు నేర్చుకున్నారు.

• డాల్టన్‌ కెండల్‌లోని క్వెకర్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో చదివే సమయంలో ఆ పాఠశాలకు హెడ్‌మాస్టర్‌ను నియమించేందుకు స్కూల్‌ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. డాల్టన్‌కు కూడా ఆ కమిటీలో చోటు కల్పించారు. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులెవరూ డాల్టన్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో స్కూలు యాజమాన్యం అతడినే ప్రధానోపాధ్యాయుడిని చేసింది. అలా 19 ఏళ్ల వయసులో ఆ స్థానంలో నియమితులైన ఆయన 1793 వరకు అక్కడే కొనసాగారు. అదే ఏడాది ఆయన మాంచెస్టర్‌లోని ఒక కాలేజీలో గణితం, తత్వశాస్త్రంలో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు.

పరిశోధనలు - ఆవిష్కరణలు:

• వర్ణ అంధత్వంపై ఈయన విస్తృత పరిశోధనలు చేసి, అది వంశపారంపర్యంగా సంభవిస్తుందని సిద్ధాంతీకరించారు. దీనిపై 1794లో మాంచెస్టర్‌ లిటరరీ అండ్‌ ఫిలసాఫికల్‌ సొసైటీకి తన పరిశీలనలను సమర్పించారు.

• 1801లో పాక్షిక పీడనాల నియమం (లా ఆఫ్‌ పార్షియల్‌ ప్రెజర్స్‌)ను రూపొందించారు.

• 1803లో ‘లా ఆఫ్‌ మల్టిపుల్‌ ప్రపోర్షన్స్‌’ను ప్రతిపాదించారు. అదే ఏడాది ‘నీరు, ఇతర ద్రవాల ద్వారా వాయువులు శోషణ ’ (The Absorption of Gases by Water and Other Liquids) అనే క్లాసిక్‌ పత్రాన్ని ప్రచురించారు.

• 1808లో ఆధునిక పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని ఆధునిక రసాయనశాస్త్రానికి పునాదిగా పేర్కొంటారు. పదార్థంలో అతి చిన్న కణానికి ఈయనే ‘ఆటమ్‌’ అని పేరు పెట్టారు. పరమాణువులు ఎలా సంపర్కం చెందుతాయో తెలిపేలా మూలకాలకు సంకేతాలను ఇచ్చారు. అవి నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి.

అవార్డులు:

• 1822లో ఫెలోషిప్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ అవార్డు అందుకున్నారు.

• 1826లో రాయల్‌ మెడల్‌ పొందారు. దీన్నే ది క్వీన్స్‌ మెడల్‌ అని కూడా పిలుస్తారు.

రచనలు:

• 1793లో Meteorological Observations and Essays అనే పుస్తకం రాశారు.

• డాల్టన్‌ ‘ఎ న్యూ సిస్టమ్‌ ఆఫ్‌ కెమికల్‌ ఫిలాసఫీ’ అనే గ్రంథాన్ని రాశారు. ఇది 1808 నుంచి 1827 మధ్య అనేక భాగాలుగా ప్రచురితమైంది.

చివరగా:

• జాన్‌ డాల్టన్‌ 1844, జులై 27న మాంచెస్టర్‌లో మరణించారు. చిన్నతనంలోనే బాల మేధావిగా పేరొంది, చదువుతున్న స్కూల్‌కే హెడ్‌ మాస్టర్‌గా ఎదిగారు. పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేశారు. ఈయన ప్రతిపాదనలు ఆధునిక భౌతిక, రసాయన శాస్త్రాల్లో అనేక పరిశోధనలకు ప్రేరణగా నిలిచాయి.


Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram