మైకెల్ ఫారడే.. బ్రిటన్ దేశానికి చెందిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈయన 1791, సెప్టెంబరు 22న లండన్ సమీపంలోని న్యూవింగ్టన్ బట్స్ అనే గ్రామంలో జన్మించారు. పేదరికం కారణంగా ప్రాథమిక విద్యాభ్యాసంతోనే చదువు ముగించాల్సి వచ్చింది.
మైకెల్ ఫారడే.. బ్రిటన్ దేశానికి చెందిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈయన 1791, సెప్టెంబరు 22న లండన్ సమీపంలోని న్యూవింగ్టన్ బట్స్ అనే గ్రామంలో జన్మించారు. పేదరికం కారణంగా ప్రాథమిక విద్యాభ్యాసంతోనే చదువు ముగించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయనకు చదువుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఇందుకోసమే ఫారడే తన 14 ఏళ్ల వయసులో బుక్ బైండింగ్, పుస్తకాలు అమ్మే షాపులో పనిలో చేరారు. ఖాళీసమయాల్లో అక్కడ అనేక రకాల పుస్తకాలు ముఖ్యంగా సైన్స్‌కు సంబంధించినవి చదివారు. ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ సంపుటాలతోపాటు జేన్ మార్సెట్ రాసిన ‘కన్వర్జేషన్స్ ఆన్ కెమిస్ట్రీ’, ఐజాక్ వాట్స్ రచించిన ‘ది ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ది మైండ్’ లాంటి పుస్తకాలు ఆ జాబితాలో ఉన్నాయి. కేవలం చదివి వదిలేయకుండా అందులోని విషయాలను, సూత్రాలను నిజ జీవితంలో వర్తింపజేసేవారు. ఆ జ్ఞానమే ఆయనలో ఆలోచనా శక్తిని రేకెత్తించింది. కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రేరేపించింది. అంతటి గొప్ప శాస్త్రవేత్త 1867, ఆగస్టు 25న మరణించారు.
రాయల్ ఇన్‌స్టిట్యూట్, రాయల్ సొసైటీకి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త సర్ హంఫ్రీ డేవీ ఓసారి లండన్‌లో ఉపన్యాసాలు ఇవ్వగా, ఫారడే వాటికి హాజరయ్యారు. అప్పటికి తన వయసు 20వ ఏళ్లు. ఆయన మాట్లాడిన ప్రతి విషయాన్ని ఫారడే శ్రద్ధగా వినడంతోపాటు వాటన్నింటినీ పుస్తకంలో రాసి, దాన్ని హంఫ్రీ డేవీకి పోస్ట్ ద్వారా పంపారు. అది చూసిన డేవీ ఫారడేను తన సహాయకుడిగా నియమించుకున్నారు. ఇదే ఫారడే జీవితాన్ని పెద్ద మలుపు తిప్పిన సంఘటన.
ల్యాబ్‌లో డేవీకి సహాయకుడిగా ఉంటూ అనేక ప్రయోగాల్లో ఫారడే పాలుపంచుకున్నారు. అక్కడే ఫారడే కొత్త ఆవిష్కరణలకు బీజం పడింది.
ఫారడే ఆవిష్కరణలు..
ఫారడే ప్రధానంగా విద్యుత్, అయస్కాంతత్వంపై చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. 1831లో ఆయన ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్‌ను కనిపెట్టి అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చని నిరూపించాడు. మనం నిత్యం ఉపయోగిస్తున్న ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రిక్ జనరేటర్, డైనమోలను తయారు చేసి ‘ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ’గా పేరొందారు. ఆయన కనిపెట్టిన ఇతర ఆవిష్కరణలను గమనిస్తే..
ఎలక్ట్రోమాగ్నటిక్ రొటేషన్ డిస్కవరీ - 1821
ఎలక్ట్రిక్ మోటార్ - 1822
వాయువుల ద్రవీకరణ, వాటి శీతలీకరణ (Liquefaction of gases and their refrigeration) - 1823
బెంజీన్ (1825)
లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ - 1834
ఫారడే కేజ్ కాన్సెప్ట్ - 1836
ఫారడే ఎఫెక్ట్ - 1845
డయామాగ్నటిజం - 1845
ఇతర ముఖ్యాంశాలు..
1824లో రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1832లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో విదేశీ సభ్యులుగా నియమితులయ్యారు.
1838లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో విదేశీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1844లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఎన్నికైన 8 మంది విదేశీ సభ్యుల్లో ఆయన ఒకరు.
1849లో రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది నెదర్లాండ్స్‌కు అసోసియేట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఒకానొక సందర్భంలో సర్ హంఫ్రీ డేవీని ‘‘మీరు కనిపెట్టింది గనుల్లో వాడే డేవీ సేఫ్టీల్యాంప్ ఒకటే కదా! మీ శిష్యుడు ఫారడే ఎన్నో కనిపెట్టాడే’’ అని ఎవరో ప్రశ్నించగా దానికి ఆయన ‘‘నేను కనిపెట్టిన అద్భుత విషయం మైకెల్ ఫారడే’’ అని జవాబిచ్చారు.
స్కూలుకు వెళ్లి చదువుకోలేకపోయినా, సొంతంగా పుస్తకాలు చదువుకోవడం ద్వారానే ఫారడే అనేక విషయాలు నేర్చుకుని, గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు.