ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్‌ అవార్డు విజేతగా మనకు సుపరిచితుడైన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆ స్థాయికి చేరే క్రమంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేకం.


ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌.. భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్‌ అవార్డు విజేతగా మనకు సుపరిచితం. అయితే ఆ స్థాయికి చేరే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేకం. చిన్నతనంలో చురుగ్గా ఉండేవాడు కాదు. మాటలు సరిగ్గా రాలేదు. చదువులోనూ అంతంతమాత్రమే.. వీటన్నింటినీ అధిగమించి, విజ్ఞానశాస్త్ర తీరు తెన్నులనే మార్చే శక్తిగా ఐన్‌స్టీన్‌ ఎదిగారు. 20వ శతాబ్దంలో పేరుగాంచిన మేధావుల్లో ఒకరిగా పేరుగాంచారు. ఈయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం:

  • 1879, మార్చి 14న జర్మనీలోని ఉల్మ్‌లో జన్మించారు. పుట్టినప్పుడే తల్లిదండ్రులు ఆయన్ను చూసి ఆందోళన చెందారు. కారణం ఐన్‌స్టీన్‌ తల అందరిలా కాకుండా పెద్దగా, అడ్డంగా సాగి ఉంది. పెరుగుతున్న క్రమంలో ఇతర పిల్లల్లా చురుగ్గా ఉండేవాడు కాదు. ఎప్పుడూ మౌనంగా, పరధ్యానంగా ఉండేవాడు. ఆరేళ్లొచ్చినా మాటలు సరిగ్గా రాలేదు. ముందుగా పదాలను నోట్లో అనుకొని, తర్వాత వాటిని కూడబలుక్కుని, వాక్యాలు పలికేవాడు. 
  • పాఠాలను అర్థం చేసుకోకుండా బట్టీపట్టడమంటే ఇష్టం ఉండేది కాదు. క్రమశిక్షణ పాటించని కారణంగా స్కూలు నుంచి బహిష్కరించారు కూడా.
  • తల్లిదండ్రులైన పౌలిన్‌ ఐన్‌స్టీన్, హెర్మన్‌ ఐన్‌స్టీన్‌ ముందు తమ కొడుకులో ఏకాగ్రత పెంచాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను వయొలిన్‌ క్లాస్‌లో చేర్పించారు. 12 ఏళ్లకే కాలిక్యులస్‌ అంతా నేర్చుకున్నాడు. సంగీతాన్ని తన జీవితంలో భాగం చేసుకున్నాడు. తర్వాతికాలంలో ఏదైనా క్లిష్టమైన సమస్యను పరిష్కరించాలన్నా, ఫార్ములా ఆలోచించాలన్నా మొదట వయొలిన్‌ వాయించేవాడు.

మలుపు తిప్పిన సంఘటన.. 

  • ఐన్‌స్టీన్‌ 1896లో స్విట్జర్లాండ్‌లోని స్విస్‌ ఫెడరల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో గణితం, భౌతికశాస్త్ర డిప్లొమా ప్రోగ్రాంలో చేరారు. 1900లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం తాను చదివిన కాలేజ్‌కే వెళ్లగా, అందులో ఆయన్ను తీసుకోలేదు. దీంతో స్విస్‌ పేటెంట్‌ ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగంలో చేరారు. అక్కడ త్వరగా పని ముగించుకుని తన సిద్ధాంతాలను రాసుకునేవారు. ఇలా 1905లో ఆయన జీవితం గొప్ప మలుపు తిరిగింది.
  • 1905లో తన 26 ఏళ్ల వయసులో మూడు పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. వీటితో మొత్తం విజ్ఞాన శాస్త్ర తీరుతెన్నులే మారిపోయాయి.
  • వాటిలో మొదటిది ఫొటో విద్యుత్‌ ఫలితానికి సంబంధించింది. టెలివిజన్, లేజర్‌ కిరణాలకు ఈ సిద్ధాంతమే మూల కారణం. దీనికే ఆయనకు 1921లో నోబెల్‌ బహుమతి వచ్చింది.
  • రెండోది ద్రవాల్లో పరమాణువుల చలనాన్ని గురించి. దీని వల్ల పరమాణువుల ఉనికిని నిర్ధారించగలిగారు.
  • మూడోది సాపేక్ష సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో రెండు భాగాలున్నాయి. ఒకటి ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అయితే, రెండోది సామాన్య సాపేక్ష సిద్ధాంతం.
  • ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం ద్వారా ఐన్‌స్టీన్‌ పదార్థం శక్తి స్వరూపమని నిరూపించారు. దాని ఫలితమే పదార్థ ద్రవ్యరాశి (m), శక్తి (E) లకు గల సంబంధాన్ని తెలిపే ప్రఖ్యాత భౌతిక సమీకరణం E = mc2 , ఇందులో c అనేది శూన్యంలో కాంతి వేగం.
  • 1905లోనే ఐన్‌స్టీన్‌ బ్రౌనియన్‌ చలన సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఇలా ఆ ఒక్క ఏడాదిలోనే భౌతికశాస్త్రానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి. అందుకే 1905ను శాస్త్రవేత్తలు ‘మిరాకిల్‌ ఇయర్‌’గా పేర్కొంటారు.
  • ఈ సిద్ధాంతాలను ప్రకటించి నూరేళ్లు అయిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి 2005ను ‘ప్రపంచ భౌతికశాస్త్ర సంవత్సరం’గా ప్రకటించింది.

అవార్డులు..

  • 1920లో బర్నార్డ్‌ పతకం పొందారు.
  • 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది.
  • 1925లో రాయల్‌ సొసైటీ ‘కోప్లీ’ పతకాన్ని ప్రదానం చేసింది.
  • 1926లో రాయల్‌ ఆస్ట్రోనామిక్‌ సొసైటీ బంగారు పతకాన్ని ఇచ్చింది.
  • 1929లో జర్మన్‌ ఫిజికల్‌ సొసైటీ నుంచి మాక్స్‌ ప్లాంక్‌ పతకం పొందారు.
  • 1999లో టైం మ్యాగజీన్‌ ఐన్‌స్టీన్‌ను శతాబ్దపు వ్యక్తిగా పేర్కొంది.

చివరగా..

  • ఐన్‌స్టీన్‌ 1955, ఏప్రిల్‌ 18న మరణించారు. ఆయనకు శవపరీక్ష నిర్వహించిన పాథాలజిస్ట్‌ డాక్టర్‌ థామస్‌ స్టోల్ట్జ్‌ హార్వే ఆయన మెదడును దొంగిలించాడు. ఆయన మేధస్సు రహస్యాన్ని ఛేదించాలనే ఉద్దేశంతో ఆయన మెదడును ముక్కలుగా కోసి రసాయన ద్రావణంలో భద్రపరిచాడు. ప్రస్తుతం అవి ఫిలడెల్ఫియాలోని మట్టర్‌ మ్యూజియంలో ఉన్నాయి. 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram