నీల్స్ బోర్ డానిష్ భౌతిక శాస్త్రవేత్త. అసలు పేరు నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. ఈయన పరమాణు నిర్మాణం, క్వాంటం సిద్ధాంతం గురించి ప్రాథమిక అవగాహన కల్పించారు. బోర్ నమూనాను అభివృద్ధి చేశారు.
నీల్స్ బోర్ డానిష్ భౌతిక శాస్త్రవేత్త. అసలు పేరు నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. ఈయన పరమాణు నిర్మాణం, క్వాంటం సిద్ధాంతం గురించి ప్రాథమిక అవగాహన కల్పించారు. బోర్ నమూనాను అభివృద్ధి చేశారు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరిగే మార్గాలను కక్ష్యలుగా (ఆర్బిట్స్) పేర్కొన్నారు. వాటికి ఆయన శక్తి స్థాయులు అని పేరు పెట్టారు. పరమాణు నిర్మాణంపై ఈయన చేసిన పరిశోధనలకుగానూ 1922లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. బోర్ ఒక తత్వవేత్త, సాంకేతిక పరిశోధనలను ముందుకు నడిపిన వ్యక్తుల్లో ముఖ్యులు. అంతేకాక 20వ శతాబ్దపు అగ్రగామి భౌతిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరొందారు. ఈయన జీవితంలోని ముఖ్య విషయాలను పరిశీలిద్దాం..!
బాల్యం - కెరీర్
♦ నీల్స్ బోర్ 1885, అక్టోబరు 7న డెన్మార్క్‌లోని కోపెన్‌హగన్‌లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు సైన్స్ పట్ల ఆసక్తి ఉండేది. 1903లో కోపెన్‌హగన్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్‌గా చేరారు. 1909లో ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, 1911లో డాక్టరేట్‌ను పొందారు. అదే ఏడాది కార్ల్స్‌బర్గ్ ఫౌండేషన్ ఫెలోషిప్‌తో ఇంగ్లండ్ వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేస్తోన్న జేజే థామ్సన్ వద్ద సహాయకుడిగా చేరారు. అక్కడి నుంచి మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ వద్ద పనిచేస్తూ వివిధ పరిశోధనల్లో పాల్గొన్నారు.
సిద్ధాంతాలు - ప్రతిపాదనలు
♦ 1911లో బోర్ - వాన్ లీయువెన్ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు.
♦ 1913లో పరమాణు నిర్మాణంపై తన సిద్ధాంతమైన బోర్ పరమాణు నమూనాను ప్రతిపాదించారు. ఈ పరిశోధనా సిద్ధాంతాలకే ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
♦ పరమాణు నిర్మాణం గురించి ఆయన చేసిన పరిశోధనలకు గానూ నీల్స్ బోర్‌ను అణు భౌతికశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు.
♦ బోర్ తన ప్రతిపాదనల్లో రూథర్‌ఫర్డ్ కేంద్రక నమూనాను, మాక్స్‌ప్లాంక్ కేంద్రక సిద్ధాంతాన్ని అన్వయించారు.
♦ పరమాణు కేంద్రకం చుట్లూ ఎలక్ట్రాన్లు స్థిర కక్ష్యల్లో పరిభ్రమిస్తాయని ఆయన ప్రతిపాదించారు.
♦ పరమాణువుల్లో వివిధ కర్పరాల్లో ఎలక్ట్రాన్ పంపిణీని బ్యూరీతో కలిసి ఆయన వివరించారు.
♦ బోర్ పరిశోధనల కారణంగానే ఆవర్తన పట్టిక రూపకల్పన, కేంద్రక విచ్ఛిత్తిపై సమగ్ర అవగాహన సాధ్యమైంది.
♦ 1920లో కరస్పాండెన్స్ సూత్రాన్ని ప్రతిపాదించారు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో ప్రాథమిక భావన.
♦ 1924లో బీకేఎస్ థియరీగా పేరొందిన బోర్-క్రామర్స్-స్లేటర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
♦ 1927లో నీల్స్ బోర్ సిద్ధాంతంలో ముఖ్యమైన లక్షణంగా పేర్కొనే ‘కాంప్లిమెంటారిటీ’ని ప్రతిపాదించారు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో భావనాత్మక అంశం.
పురస్కారాలు
♦ సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో (Theoretical physics) పరిశోధనలకు గానూ 1921లో హ్యూస్ మెడల్ పొందారు.
♦ 1922లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి అందుకున్నారు.
♦ 1923లో భౌతిక శాస్త్రవేత్తలకు అందించే మాట్టేయుచి మెడల్ (Matteucci Medal) పొందారు.
♦ 1931లో మాక్స్ ప్లాంక్ మెడల్ అందుకున్నారు.
♦ 1938లో రాయల్ సొసైటీ కోప్లీ మెడల్ పొందారు.
♦ 1961లో సోనింగ్ బహుమతి గెలుచుకున్నారు.
చివరగా
♦ బోర్ 1920లో కోపెన్‌హగన్ యూనివర్సిటీలో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్’ను ఏర్పాటు చేశారు. దీన్ని ప్రస్తుతం నీల్స్ బోర్ ఇన్‌స్టిట్యూట్ అని పిలుస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తొలి అణు బాంబును తయారు చేయాలనుకున్న ‘మాన్‌హట్టన్ ప్రాజెక్టు’లో బోర్ సభ్యుడిగా ఉన్నారు. ఈయన 1962, నవంబరు 18న కోపెన్‌హగన్‌లో మరణించారు.