జగదీష్ చంద్రబోస్ మన దేశానికి చెందిన భౌతిక, జీవశాస్త్రవేత్త. రేడియో మైక్రోవేవ్ ఆప్టిక్స్‌పై పరిశోధనలు చేశారు. ఎలక్ట్రానిక్స్, ప్లాంట్ సైన్స్, రేడియో ఫిజిక్స్ పురోగతికి విశేషంగా కృషిచేశారు. పురాతన కాలం నుంచే భారతదేశంలో విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిందని, వలస పాలకుల వల్ల అది మరుగునపడిందని ఆయన భావించేవారు.
జగదీష్ చంద్రబోస్ మన దేశానికి చెందిన భౌతిక, జీవశాస్త్రవేత్త. రేడియో మైక్రోవేవ్ ఆప్టిక్స్‌పై పరిశోధనలు చేశారు. ఎలక్ట్రానిక్స్, ప్లాంట్ సైన్స్, రేడియో ఫిజిక్స్ పురోగతికి విశేషంగా కృషిచేశారు. పురాతన కాలం నుంచే భారతదేశంలో విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిందని, వలస పాలకుల వల్ల అది మరుగునపడిందని ఆయన భావించేవారు. అందుకే తాను శాస్త్రవేత్తగా మారాలని నిర్ణయించుకున్నారు. బోస్ మొదట భౌతికశాస్త్రంలో తర్వాత మొక్కల శరీర ధర్మశాస్త్రంలో ప్రయోగాలు చేశారు. వైర్‌లెస్ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. మొక్కలకు ప్రాణం ఉంటుందని.. ప్రేమ, ఆప్యాయత, బాధ, సంతోషం అన్నీ అనుభవించే స్పందనలు ఉన్నాయని నిరూపించి విశ్వమానవుడిగా చరిత్రలో నిలిచారు. ఈయన్ను భారతదేశ మొదటి ఆధునిక శాస్త్రవేత్త అని కూడా అంటారు.
బాల్యం - కెరీర్:
♦ జగదీష్ చంద్రబోస్ 1858, నవంబరు 30న మైమెన్‌సింహ్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జన్మించారు. తండ్రి భగవాన్‌చంద్ర బోస్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి. అయినప్పటికీ తన కుమారుడిని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో కాకుండా బెంగాలీ బడిలో చేర్పించారు. ఉన్నత చదువుల కోసం కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరారు. అక్కడ అధ్యాపకుడిగా ఉన్న లాఫంట్ ప్రోత్సాహంతో సైన్స్ పట్ల అవగాహన పెరిగింది.
♦ 1879లో కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో బీఏ పట్టా పొందారు. తర్వాతి చదువులకు ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లారు. 1884లో ఆయన భారత్ తిరిగివచ్చి కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ కాలేజ్‌లో భౌతికశాస్త్ర ప్రొఫెసర్‌గా చేరారు. ఆ కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన మొదటి భారతీయుడు ఈయనే.
♦ 1917లో బోస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, కోల్‌కతాలో బోస్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఇది ఆసియాలోనే మొట్టమొదటి ఇంటర్‌డిసిప్లినరీ పరిశోధనా కేంద్రం. మరణించేవరకు బోస్ దీనికి డైరెక్టర్‌గా ఉన్నారు.
పరిశోధనలు:
♦ 1895లో విద్యుదయస్కాంత తరంగాల ద్వారా మొదటిసారి వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను బోస్ ప్రదర్శించారు. ఈయన్ను రేడియో, వైర్‌లెస్ కమ్యూనికేషన్ పితామహుడిగా పేర్కొంటారు. అయితే వైర్‌లెస్ కమ్యూనికేషన్ ప్రజలకు అందుబాబులో ఉండాలని ఆయన పేటెంట్ తీసుకోలేదు.
♦ 1894-98 మధ్య కాలంలో మిల్లీమీటర్ - వేవ్ రేడియో సిగ్నళ్లపై అనేక ప్రయోగాలు నిర్వహించారు. వాటిని గుర్తించే ఘనస్థితి సెమీకండక్టర్ డయోడ్ అయిన గలీనా డిటెక్టర్‌ను కనుక్కున్నారు. 1904లో ఆయన దీనిపై అమెరికా నుంచి పేటెంట్ పొందారు. ఈ విధంగా యూఎస్‌ఏ పేటెంట్ పొందిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు.
♦ మైక్రో తరంగాల ఉత్పత్తి, స్వీకరణలో కీలకమైన హార్న్ యాంటెన్నాను 1897లో ఆవిష్కరించారు. ఇవేకాకుండా పోలరైజర్లు, వేవ్‌గైడ్లను కనుక్కున్నారు.
♦ వృక్షాల పెరుగుదలను కొలిచే క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని రూపొందించారు. దీని ద్వారా మొక్కల కణజాలాలు, ప్రసరణ వ్యవస్థ, ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేశారు. అంతేకాక మొక్కలు కాంతి, ఉష్ణోగ్రత, రసాయనాలు లాంటి బాహ్య ఉద్దీపనలకు చలిస్తాయని మొదటిసారిగా నిరూపించారు.
♦ ‘మార్కోని’ కంటే ముందే ఈయన వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్‌ను కనుక్కున్నారని భౌతికశాస్త్రవేత్తల అభిప్రాయం. సూర్యుడి కాంతి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు వెలువడతాయని ప్రతిపాదించారు. దీన్ని శాస్త్రవేత్తలు 1944లో రుజువు చేశారు.
పురస్కారాలు - గౌరవాలు:
♦ ‘ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ పోలరైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్‌వేవ్’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు 1917లో నైట్, 1920లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోగా నియమితులయ్యారు. భౌతికశాస్త్రంలో ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడు ఈయనే.
♦ 1927లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 14వ సెషన్‌కు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు.
♦ 1928లో వియన్నా సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడయ్యారు.
♦ 1937లో ఆయన మరణించాక చంద్రుడిపై ఉన్న ఒక పెద్ద బిలానికి ‘ది బోస్ క్రేటర్’ అని పేరు పెట్టారు.
♦ ఆయన 150వ జయంతి సందర్భంగా కేంబ్రిడ్జిలోని క్రైస్ట్స్ కళాశాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
చివరగా:
♦ ఆయన రాసిన ప్రముఖ పుస్తకాలు - ‘రెస్పాన్స్ ఇన్ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ (1902)’, ‘ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ (1926)’. బోస్ 1937, నవంబరు 23న బిహార్‌లో మరణించారు.