ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనగానే చాలామందికి ఆయన భారతదేశ మొట్టమొదటి సివిల్‌ ఇంజినీర్‌ అని, పలు ప్రముఖ ఆనకట్టలు నిర్మించారని, అనేక ప్రాంతాల్లో వరద రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారని జ్ఞప్తికి వస్తుంది. అంతేకాకుండా ఆయనో గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు కూడా.


మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనగానే చాలామందికి ఆయన భారతదేశ మొట్టమొదటి సివిల్‌ ఇంజినీర్‌ అని, పలు ప్రముఖ ఆనకట్టలు నిర్మించారని, అనేక ప్రాంతాల్లో వరద రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారని జ్ఞప్తికి వస్తుంది. అంతేకాకుండా ఆయనో గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు కూడా. మైసూర్‌ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు. దేశంలో సాంకేతిక విద్యాసంస్థల రూపకల్పన, అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. అనేక పరిశ్రమలను ఏర్పాటు చేశారు. భారత్‌లో ప్రణాళికలను రూపొందించి.. ‘ప్రణాళికల పితామహుడిగా’ పేరొందారు.  

బాల్యం - వృత్తి జీవితం:

♦ విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న మైసూర్‌ రాజ్యంలోని మద్దెనహళ్లి (ప్రస్తుతం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లాలో ఉంది)లో జన్మించారు. ఈయన పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని (ఆంధ్రప్రదేశ్‌) బేస్తవారపేట మండలంలో ఉన్న మోక్షగుండం. వీరు అక్కడ నుంచి కర్ణాటకకు వలస వెళ్లారు.

♦ ఉన్నత విద్యను బెంగళూరులో అభ్యసించారు. 15 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ, చదువుకునేందుకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. 1881లో బెంగళూరులోని సెంట్రల్‌ కాలేజీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యారు.

♦ ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఆయన పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో చేరారు. 1883లో సివిల్‌ ఇంజినీరింగ్‌ లైసెన్సియేట్‌ (ఎల్‌సీఈ), ఫస్ట్‌ క్లాస్‌ ఇంజినీర్‌ (ఎఫ్‌సీఈ) పరీక్షల్లో మొదటి ర్యాంకు పొందారు. అదే ఏడాది ఆయన మహారాష్ట్రలోని నాసిక్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా నియమితులయ్యారు.

ప్రసిద్ధ నిర్మాణాలు - స్థాపనలు:

♦ 1903లో పుణె సమీపంలోని ఖడక్‌వాస్లా డ్యాం వద్ద ఆటోమేటిక్‌ వాటర్‌ ఫ్లడ్‌ గేట్ల వ్యవస్థను రూపొందించారు. దీనికి ఆయన పేటెంట్‌ కూడా పొందారు. వరద సమయంలో నీటి ప్రవాహానికి తగ్గట్లు ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నీటిని నిల్వ చేయడం వీటి ప్రత్యేకత. తర్వాతి కాలంలో ఈ వ్యవస్థను గ్వాలియర్‌లోని టిగ్రా ఆనకట్ట, మైసూర్‌లోని కృష్ణరాజ సాగర డ్యాం వద్ద ఏర్పాటు చేశారు.

♦ 1906-07లో నీటి సరఫరా, నీటిపారుదల వ్యవస్థపై అధ్యయనం చేయాల్సిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ను బ్రిటిష్‌ కాలనీ ఆఫ్‌ ఆడెన్‌ (ప్రస్తుత యెమన్‌)కు పంపింది.

♦ 1908లో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ పొంది, ఆ సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల స్థితిగతులను అధ్యయనం చేయాలని విదేశీ పర్యటనకు వెళ్లారు.

♦ హైదరాబాద్‌ను మూసీ వరదలు ముంచెత్తడంతో నాటి నిజాం ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అభ్యర్థన మేరకు 1909లో విశ్వేశ్వరయ్య నగరానికి వరద రక్షణ వ్యవస్థను డిజైన్‌ చేశారు.

♦ విశాఖపట్నం ఓడరేవును సముద్ర కోత నుంచి రక్షించే వ్యవస్థను ఆయన రూపొందించారు.

♦ 1909, నవంబరులో మైసూరు సంస్థానం దివాన్‌ పీవీ మాధవరావు ఆహ్వానం మేరకు విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని కృష్ణరాజ సాగర డ్యాంకు చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేశారు.

♦ 1912లో మైసూర్‌ మహారాజు కృష్ణరాజ వడయార్‌ విశ్వేశ్వరయ్యను సంస్థాన దివాన్‌గా నియమించారు. 1918 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన రాజ్య అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. ఎన్నో సంస్థలు నెలకొల్పారు.

వాటిలో ముఖ్యమైనవి: మైసూర్‌ సోప్‌ ఫ్యాక్టరీ, పారాసిటాయిడ్‌ ల్యాబొరేటరీ, భద్రావతిలోని మైసూర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వర్క్స్, బెంగళూరు పాలిటెక్నిక్‌ (ప్రస్తుతం శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్‌ పేరుతో ఉంది), బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, బెంగళూరులో గవర్నమెంట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ (ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ విశ్వేశ్వరయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పేరుతో ఉంది).

అవార్డులు - గౌరవాలు:

♦ 1911లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎంపైర్‌’ ప్రదానం చేసింది.

♦ 1918లో బ్రిటిష్‌ ప్రభుత్వం ‘నైట్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎంపైర్‌’గా సత్కరించింది.

♦ 1923లో జరిగిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు ఆయన అధ్యక్షత వహించారు.

♦ 1955లో భారత ప్రభుత్వం ఈయన్ను భారతరత్న పురస్కారంతో గౌరవించింది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఎనిమిది డాక్టరేట్లు పొందారు.

ఇతర ముఖ్యాంశాలు:

♦ ప్రణాళికలకు సంబంధించిన వివిధ విషయాలను తెలుపుతూ విశ్వేశ్వరయ్య 1934లో Planned Economy for India అనే గ్రంథాన్ని రాశారు.

♦ ఈయన పుట్టిన రోజైన సెప్టెంబరు 15ను మన దేశంలో ‘ఇంజినీర్స్‌ డే’గా ఏటా జరుపుకుంటున్నాం. 1968 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

♦ విశ్వేశ్వరయ్య 1962, ఏప్రిల్‌ 14న బెంగళూరులో మరణించారు.


Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram