ప్రపంచ జల దినోత్సవం

ప్రపంచ జల దినోత్సవం

సమస్త ప్రాణకోటికి నీరు ప్రాణాధారం. ప్రకృతిలో లభించే అతిముఖ్యమైన సహజ వనరుల్లో ఇది ఒకటి. మానవ ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థల సమతౌల్యానికి ఇది అత్యంత ఆవశ్యకం. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి కొరత, కాలుష్యం, దుర్వినియోగం లాంటివి భూమి స్థిరత్వానికి తీవ్రముప్పును కలిగిస్తున్నాయి. నీటి ప్రాముఖ్యత, దాని సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’గా(World Water Day) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నీటికి సంబంధించిన సమస్యలను గుర్తించడంతోపాటు నీరు, పారిశుద్ధ్య సంక్షోభాన్ని వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

భూమిపై నీరు..

  • విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన గ్రహాల్లో భూమిపై మాత్రమే నీరు ఉంది. మొత్తం భూవైశాల్యం 510 మిలియన్ల చ.కి.మీ. ఉంటే అందులో సుమారు 361 మిలియన్ల చ.కి.మీ. (70.7%) జలం ఆవరించి ఉంది. భూమిపై పర్యావరణ సమతౌల్యానికి ప్రధాన కారణం నీరే.  
  • భూమిపై ఉన్న జలావరణంలో అత్యధిక జలం (97.25%) మహాసముద్రాల్లో ఉప్పునీటి రూపంలో ఉంది. దీన్ని జీవులు వినియోగించుకోలేవు. మిగిలిన మంచినీరులో మంచు, హిమనీనదాల రూపంలో 2.05%, భూగర్భ జలంగా 0.68%, సరస్సుల్లో 0.01%, నదుల్లో ప్రవాహ నీరుగా 0.0001% మేర విస్తరించి ఉంది.
  • ప్రపంచంలో బ్రెజిల్, రష్యా, చైనా, కెనడా, ఇండోనేసియా, అమెరికా, భారత్, కొలంబియా, కాంగో లాంటి దేశాల్లో 60% నీటి లభ్యత ఉండగా, మిగిలిన దేశాలన్నింటిలో 40% నీటి లభ్యత ఉంది.

గణాంకాలు..

  • ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల ప్రజలకు ఇప్పటికీ తమ నివాస ప్రాంగణాల్లో తాగునీటి సదుపాయం లేదు. ప్రతి మూడు కుటుంబాల్లో రెండిటిలో నీటిని సేకరించే బాధ్యత కేవలం మహిళలదే.
  • 100 కోట్లకు పైగా మహిళలకు (మొత్తం స్త్రీలలో 27.1%) సురక్షిత మంచినీరు అందడం లేదు.
  • ప్రపంచవ్యాప్తంగా సురక్షితం కాని నీరు తీసుకోవడం; పారిశుద్ధ్యం, పరిశుభ్రత లోపాల కారణంగా రోజూ అయిదేళ్లలోపు వయసు వారు సుమారు వెయ్యిమంది మరణిస్తున్నారు.

యునిసెఫ్‌ ప్రకారం..

  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదు.
  • ప్రతి అయిదుగురిలో ఇద్దరికి సురక్షిత పారిశుద్ధ్య సౌకర్యం లేదు.
  • ప్రతి నలుగురిలో ఒకరికి ప్రాథమిక పరిశుభ్రత సేవలు అందడం లేదు.
  • 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు నలుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రాంతల్లో నివసిస్తారని అంచనా.
  • తీవ్రమైన నీటి కొరత కారణంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 70కోట్ల మంది నిరాశ్రయులయ్యే ముప్పు ఉంది.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, సురక్షితం కాని తాగునీరు, పారిశుద్ధ్య లోపం, చేతుల పరిశుభ్రత లేకపోవడం లాంటి కారణాలతో ఏటా అతిసార వ్యాధితో 8,29,000 మంది మరణిస్తున్నారని అంచనా.

ఆరో సుస్థిరాభివృద్ధి లక్ష్యం..

  • ఐక్యరాజ్య సమితి (ఐరాస) 2030 డిసెంబరు నాటికి ప్రపంచ దేశాలు సాధించాలని నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆరోది - ‘పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం’. దీని ప్రకారం, 2030 నాటికి ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందుబాటులోకి తేవాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి. జలవనరుల సుస్థిర నిర్వహణ చేపట్టాలి.
  • ప్రపంచవ్యాప్తంగా నీటి వనరుల డిమాండ్‌ ఏటా 1% పెరుగుతోంది. అందుకే ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆరో ప్రాధాన్యంగా నీటి నిర్వహణను చేర్చింది.

భారతదేశంలో నీటి లభ్యత..

  • నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌సీఐడబ్ల్యూఆర్‌డీ) ప్రకారం, 329 మిలియన్ల హెక్టార్లున్న భారత భూభాగంపై జలచక్రం ద్వారా 4 వేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) నీరు లభిస్తోంది. ఇందులో 40% (1600 బీసీఎం) ఆవిరైపోగా, 9% (360 బీసీఎం) నేలలో తేమ రూపంలో, 10% (400 బీసీఎం) భూగర్భజలంగా ఉంటుంది. మిగిలిన 41% (1640 బీసీఎం) నదులు, చెరువులు, సరస్సుల్లో ఉపరితల జలంగా నిల్వ ఉంటుంది.
  • దేశంలో ఉపరితల, భూగర్భ జలాలుగా ఉన్న మొత్తం 2040 బీసీఎం నీరు.. దేశ వ్యవసాయ, గృహ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది.
  • 2025 నాటికి మన దేశంలో వ్యవసాయానికి 910 బీసీఎం, తాగునీటికి 73 బీసీఎం, విద్యుత్‌ శక్తికి 15 బీసీఎం, పరిశ్రమలకు 23 బీసీఎం నీటి డిమాండ్‌ ఉంది. ఇది మొత్తంగా 1093 బీసీఎం.

చారిత్రక నేపథ్యం:

  • 1992, జూన్‌ 3 - 14 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డి జెనీరో వేదికగా ఐక్యరాజ్య సమితి పర్యావరణం, అభివృద్ధి సమావేశం(United Nations Conference on Environment and Development - UNCED)  జరిగింది. దీన్నే ‘ఎర్త్‌ సమ్మిట్‌’ అని కూడా అంటారు. నీటి ప్రాముఖ్యత, దాని నిర్వహణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’గా జరపాలని ఈ సందర్భంగా సభ్య దేశాలు భావించాయి. అదే ఏడాది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఈ రోజును అధికారికంగా నిర్వహించాలని తీర్మానించింది. 1993లో మొదటి ‘వరల్డ్‌ వాటర్‌ డే’ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.
  • 2026 నినాదం: "Water and Gender"

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భూమిపై లభించే నీటిలో సుమారు ఎంత శాతం సముద్రాలు, మహాసముద్రాల్లో ఉంది?

(టీఎన్‌ పోలీస్‌ కానిస్టేబుల్, 2022)

1) 50%   2) 75%

3) 97%    4) 60%

సమాధానం: 3

2. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020),(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2022),

(హెచ్‌టీఈటీ పీఆర్‌టీ, 2019),(కేరళ పీఎస్సీ ప్రిలిమ్స్, 2021)

1) ఆగస్టు 20   2) మార్చి 22

3) ఏప్రిల్‌ 4    4) జనవరి 24

సమాధానం: 2

3. ‘పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం’ అనేది ఎన్నో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది?

1) 4   2) 7   3) 6   4) 5

సమాధానం: 3 

4. What was the focus of World Water Day, observed globally on 22 March 2025?
(RRB NTPC (UG), 2025)

1) Water for peace

2) Water and climate change

3) Accelerating change

4) Glacier preservation

Ans: 4

5. By what year is SDG6 focused on ensuring that everyone has access to clean, reliable water and adequate water sanitation?
(MP Excise Constable, 2023)

1) 2040  2) 2030

3) 2025    4) 2035

Ans: 2

6. The total utilisable water resource in India is only ___.
(EMRS PGT (Geography), 2023)

1) 1052 cubic km   2) 1152 cubic km

3) 1022 cubic km   4) 1122 cubic km

Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram