అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

పనిచేయాలనే కోరిక, పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభాను శ్రామికశక్తిగా పేర్కొంటారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో వీరు ఎంతో కీలకంగా ఉంటారు. దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేసే శక్తి వీరికి ఉంది. ఆర్థికాభివృద్ధిలో కార్మికుల కృషికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 1న ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’గా (International Labour Day) నిర్వహిస్తారు. దీన్నే ‘మే’ డే అని కూడా అంటారు. కష్టపడే, అంకితభావంతో పనిచేసే కార్మికులను గుర్తించడంతోపాటు; వారి హక్కులు, సమస్యల పరిష్కారంపై జరిపిన పోరాటాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

కార్మికులు అంటే?

  • ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) ప్రకారం, 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు వారిలో పని చేయాలనే కోరికతోపాటు పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటే వారిని కార్మికులుగా పేర్కొంటారు.
  • అమెరికాలో 16 ఏళ్ల కంటే ఎక్కువ వయసువారిని లేబర్‌ ఫోర్స్‌లోకి తీసుకుంటారు.
  • మన దేశంలో 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసువారిని కార్మిక శక్తిగా లెక్కగడతారు.

ఎంప్లాయిమెంట్‌ అండ్‌ సోషల్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2026

  • అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఏటా ఎంప్లాయిమెంట్‌ అండ్‌ సోషల్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. ఇది ప్రపంచ కార్మిక మార్కెట్ల గురించి సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. 2026 ఏడాదికి సంబంధించిన నివేదికను జనవరి 14న విడుదల చేసింది. అందులోని ముఖ్య విషయాలను పరిశీలిస్తే..
  • 2026లో ప్రపంచ నిరుద్యోగ రేటు 4.9శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఇది సుమారు 186 మిలియన్ల ప్రజలకు సమానం.
  • పనిచేయగలిగే సామర్థ్యం ఉండి, అది పొందలేని వారి సంఖ్య 2026లో 408 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 

భారత్‌లో కార్మిక (లేబర్‌) కోడ్‌లు

దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక (లేబర్‌) కోడ్‌లు ఉన్నాయి. గతంలో అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో వీటిని రూపొందించారు. వీటి ద్వారా కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పిస్తారు. కార్మిక చట్టాల పరిధిలోకి రాని శ్రామిక శక్తిలో 90శాతమైన 5 కోట్లకుపైగా సంఘటిత, అసంఘటితరంగ కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం లేబర్‌ కోడ్‌ల లక్ష్యం. వారికి వేతన, సామాజిక, ఆరోగ్య భద్రతలతోపాటు జీతం విషయంలో లింగ సమానత్వం, కనీస వేతనం అందేలా చూడటం వీటి ముఖ్య ఉద్దేశం. ఈ 4 కార్మిక కోడ్‌లు దేశవ్యాప్తంగా ఒకేసారి 2025, నవంబరు 21 నుంచి అమల్లోకి వచ్చాయి.

చారిత్రక నేపథ్యం:

19వ శతాబ్దం చివరి నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు మెరుగైన పని పరిస్థితులు, న్యాయమైన వేతనాలు, తక్కువ పని గంటల కోసం పోరాటాలు చేయడం ప్రారంభించారు. 1986, మే 1న అమెరికావ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాన్ని కోరుతూ సుమారు నాలుగు లక్షల మంది కార్మికులు సమ్మె చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషలిస్ట్, లేబర్‌ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సెకండ్‌ ఇంటర్నేషనల్‌ సమావేశం 1989లో పారిస్‌లో జరిగింది. అందులో ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. మన దేశంలో మొదటి కార్మిక దినోత్సవాన్ని 1923లో మద్రాస్‌ (ప్రస్తుత చెన్నై)లో నిర్వహించారు. ఇది లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆఫ్‌ హిందుస్థాన్‌ ఆధ్వర్యంలో జరిగింది. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017), (యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ జేఈ, 2016),
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2025), (బీఎస్‌ఎస్‌సీ గ్రూప్‌ డి, 2025),
(యూపీ పోలీస్‌ ఏఎసఐ, 2021), (రాజస్థాన్‌ థర్డ్‌ గ్రేడ్‌ (లెవల్‌ 1), 2013),
(యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ పీఈటీ, 2022), (ఓఎస్‌ఎస్‌సీ జూనియర్‌ స్టెనోగ్రాఫర్, 2023),
(ఆర్‌పీఎస్‌సీ ఏఈ, 2013), (యూపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2024), 
(ఓఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)

1) మే 1         2) మే 17   3) డిసెంబరు 10   4) జూన్‌ 5

సమాధానం: 1

2. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)ను ఎప్పుడు స్థాపించారు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021), (యూకేపీఎస్సీ ప్రిలిమ్స్, 2022)

1) 1931   2) 1919 3) 1921   4)1909

సమాధానం: 2

3. సామాజిక భద్రత కనీస ప్రమాణాలపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) కన్వెన్షన్‌ నంబరు 102ను ఏ సంవత్సరంలో ఆమోదించారు?
(యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓ (ఎల్‌ఈఓ), 2018)

1) 1948   2) 1953  3) 1952   4) 1950

సమాధానం: 3

4. Headquarters of International Labour Organization (ILO) is situated at ___
(UP NHM Staff Nurse 2021)
1) Paris        2) Frankfurt        3) Geneva        4) New York
Ans: 3
5. Periodic Labour Force Survey (PLFS) is conducted by which institution in India?
(SSC CHSL 2025)
1) NSO
2) Development Intelligence Unit
3) Ministry of Labour and Employment
4) NITI Aayog
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram