భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ మారణకాండ అత్యంత భయానక సంఘటనగా నిలిచింది. భారతీయులపై బ్రిటిష్ సైన్యం జరిపిన ఈ క్రూరమైన హింసాకాండ మానవ జాతి చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది. ఏడు నెలల పసిపాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల దాకా వందలాది మంది ఆంగ్లేయుల రాక్షసత్వానికి బలయ్యారు. దేశ స్వరాజ్య ఉద్యమంలో ఆ ఘటన కీలక మలుపుగా నిలిచింది. జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగి 2026 ఏప్రిల్ 13 నాటికి 107 ఏళ్లు. ఈ అమానుష సంఘటనకు గుర్తుగా మన దేశంలో ఏటా ఏప్రిల్ 13న ‘జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినాన్ని’ (Jallianwala Bagh Commemoration Day) నిర్వహిస్తారు. పోటీపరీక్షల కోణంలో ఈ ఘటనకు సంబంధించిన ముఖ్య విషయాలను తెలుసుకుందాం..!
- జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని అమృత్‌సర్ మారణకాండ అని కూడా అంటారు. బ్రిటిష్ వలస సైన్యాలు ఎంతో మంది అమాయక భారతీయును నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటన ఇది.
- జలియన్ వాలాబాగ్ అనేది చుట్టూ ఇళ్లు ఉండి మధ్యలో ఖాళీగా ఉండే స్థలం. ఇందులోకి వెళ్లేందుకు ఇళ్ల మధ్యలో నుంచి ఒక సన్నటి దారి ఉంటుంది.
- జనరల్ డయ్యర్ ఆ మార్గాన్ని మూసేసి, తన సైన్యంతో అక్కడి జనసమూహంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించాడు. సైనికుల వద్ద తూటాలు అయిపోదాకా ఫైరింగ్ ఆగలేదు. ఈ తీవ్ర హింసాత్మక చర్య బ్రిటిష్ వలస పాలన కఠోర వాస్తవికతను ప్రపంచానికి చూపించింది. దేశవ్యాప్తంగా ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత మరింత పెరిగేలా దోహదం చేసింది.
రౌలత్ చట్టం
- మొదటి ప్రపంచ యుద్ధ కాలం (1914-18)లో భారతీయుల సహకారం కోసం అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్ అనేక హామీలు ఇచ్చాడు. అది నమ్మి భారతీయులు ఆంగ్లేయులకు యుద్ధంలో సహకారం అందించారు.
- యుద్ధకాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒకవైపు భారతీయుల సహాయం కోరుతూనే, మరోవైపు తీవ్ర అణచివేత చర్యలకు దిగింది.
- బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలను అణచివేసేందుకు జస్టిస్ రౌలత్ కమిటీ నివేదిక ఆధారంగా, 1919లో అరాచకత్వం, విప్లవాత్మక నేరాల చట్టం (Anarchical and Revolutionary Crimes Act) 1919 తీసుకొచ్చింది. దీన్నే రౌలత్ చట్టం అంటారు.
- ఈ చట్టం దేశద్రోహానికి పాల్పడినట్లు అనుమానం వచ్చినా చాలు.. ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేయడానికి పోలీసులకు విశేష అధికారాలు ఇచ్చింది. అంటే ఏ వ్యక్తినైనా విచారణ, నేర నిరూపణ లేకుండా నిర్బంధించవచ్చు.
- దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమాలు సాగించారు.
- రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ ‘సత్యాగ్రహ సభ’ స్థాపించి 1919, ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా అహింసాయుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు, సమ్మెలు, సామూహిక ప్రదర్శనలు జరిగాయి.
- ప్రజల సత్యాగ్రహాన్ని అణచేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గాంధీజీ సహా ఆయా ప్రాంతాల్లో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య నాయకులందరినీ నిర్బంధించింది. ఈ అరెస్టులకు నిరసనగా ప్రజలు మరింత ఉద్ధృతంగా ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. దీంతో ఆంగ్లేయులు హింసాత్మక చర్యలకు పూనుకున్నారు.
మారణకాండ జరిగిన తీరు..
- రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్నారనే నెపంతో పంజాబ్‌లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను 1919, ఏప్రిల్ 9న బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది. దీంతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. దాంతో ప్రభుత్వం అమృత్‌సర్‌లో మార్షల్ లా విధించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్ డయ్యర్‌కు అప్పగించింది.
- 1919, ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ మైదానంలో ఒకవైపు ఉద్యమకారులు నిరసన సభకు హాజరయ్యారు.
- అదే రోజు వైశాఖీ పర్వదినం కావడంతో వేడుకల కోసం గ్రామీణులు, పట్టణవాసులు మరోవైపు సమావేశమయ్యారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. మైదానానికి వచ్చినవారిలో చాలామందికి ఆ విషయం తెలియదు. ఆ సమయంలో దాదాపు 20వేల అంది అందులో ఉన్నారు.
- మైదానం చుట్టూ ఇళ్లు, ఎత్తయిన గోడ ఉన్నాయి. వెళ్లి - రావడానికి ఒక్కటే మార్గం. ఇలాంటి స్థితిలో ఆ సమావేశ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సాయుధ దళం, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అక్కడి ప్రజలపై కాల్పులు జరిపింది.
- 10 నుంచి 15 నిమిషాల పాటు ఏకధాటిగా ఫైరింగ్ కొనసాగింది. మొత్తం 1,650 రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. తుపాకీ గుళ్లను తప్పించుకునేందుకు చాలామంది పక్కనే ఉన్న బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతమంతా శవాల దిబ్బలా మారింది.
చివరగా..
జలియన్‌వాలా బాగ్ ఉదంతం భారత స్వాతంత్య్రోద్యమ రూపురేఖలను మార్చివేసింది. ఈ నరమేధంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘నైట్‌హుడ్’ను త్యజించారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో బోయర్ల యుద్ధం సందర్భంగా బ్రిటిషర్లు ఇచ్చిన ‘కైజర్’ బిరుదును త్యజించారు. శంకరన్ నాయర్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వరాజ్య కాంక్ష ప్రతి భారతీయుడిలో ఉప్పొంగింది. జలియన్ వాలాబాగ్ మారణహోమం తర్వాత నుంచి ప్రజా సమూహాలపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరపడాన్ని నిషేధించారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
1. జలియన్ వాలాబాగ్ దురాగతం ఎప్పుడు జరిగింది?
(హెచ్‌పీ టీజీటీ (మెడికల్) టీఈటీ, 2017), (ఎన్‌టీపీసీ, 2020),
(46వ బీపీఎస్సీ ప్రిలిమ్స్, 2004), (ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్), 2025),
(ఎస్‌ఎస్‌సీ సీపీఓ టైర్ 1, 2019)
1) 1918, ఏప్రిల్ 13 2) 1919, ఏప్రిల్ 13
3) 1920, ఏప్రిల్ 13 4) 1921, ఏప్రిల్ 13
సమాధానం: 2
2. రౌలత్ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కింది ఏ సంవత్సరంలో ఆమోదించింది?
(ఎన్‌హెచ్‌పీసీ/ టీహెచ్‌డీసీ జేఈ (మెకానికల్), 2023),(ఎన్‌టీపీసీ 2021)
1) 1901 2) 1909 3) 1925 4) 1919
సమాధానం: 4
3. The Rowlatt Act aimed at
(UPSC Civil Services Exam Prelims, 2012)
1) compulsory economic support to war efforts
2) imprisonment without trial and summary procedures for trial
3) suppression of the Khilafat Movement
4) imposition of restrictions on freedom of the press
Ans: 2
4. Which committee or commission did the British government form to investigate the 1919 Jallianwala Bagh massacre?
(Punjab Police Constable, 2025)
1) Rowlatt Committee 2) Woodhead Commission
3) Hunter Commission 4) Simon Commission
Ans: 3
5. The infamous Jallianwala Bagh massacre occurred when Gandhi called all the Indians to observe April 6, 1919, as a day of non-violent protest against which of the following colonial policies?
(RRB NTPC (UG), 2025)
1) Partition of Bengal 2) Rowlatt Act
3) Simon Commission 4) Minto-Morley reforms
Ans: 2