ప్రభుత్వ రంగ దినోత్సవం

ప్రభుత్వ రంగ దినోత్సవం

ప్రభుత్వ రంగ సంస్థలు (Public Sector Undertakings - PSUs) భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. ఇవి ప్రజలకు, దేశానికి ప్రయోజనం కల్పించే వస్తు, సేవలను అందిస్తాయి. మన దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుంది. ఇందులో ప్రభుత్వ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. లాభాపేక్ష లేకుండా కేవలం సామాజిక సంక్షేమమే పరమావధిగా ఈ రంగం పనిచేస్తుంది. భారతదేశ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ రంగ సంస్థలు అందిస్తోన్న సహకారానికి గుర్తుగా మన దేశంలో ఏటా ఏప్రిల్‌ 10న ‘ప్రభుత్వ రంగ దినోత్సవం’గా (Public Sector Day) నిర్వహిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను తెలియజేయడంతోపాటు సమాజ శ్రేయస్సులో వాటి నిబద్ధతను గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ప్రభుత్వ రంగ సంస్థ అంటే?

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్న కంపెనీలు లేదా కార్పొరేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్‌ 2(45) ప్రకారం వీటిలో ఆయా ప్రభుత్వాలకు 51% లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది.
  • ప్రభుత్వ అధీనంలోని సంస్థలు వ్యాపారాన్ని నిర్వహించడం, సాధారణ ప్రజలకు నాణ్యమైన వస్తు-సేవలు అందించడం అనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటయ్యాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా లేదా కలిసి వీటిని నిర్వహిస్తాయి.
  • ఉద్యోగాల కల్పన ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, దేశ జీడీపీని పెంపొందించడంలో తమ వంతు సాయం చేయడం వీటి ప్రధాన లక్ష్యాలు.
  • స్వాతంత్య్రానంతరం దేశాన్ని వృద్ధి పథంలో నడపటంలో, అవసరమైన సేవలు - మౌలిక సదుపాయాలు అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు లక్ష్యాలు..

  • ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలైన మౌలిక సదుపాయాలు, తయారీ, సేవలు లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం. తద్వారా ఆర్థిక వృద్ధి పెంపొందించడానికి, ఉద్యోగాల కల్పనకు సాయం చేయడం.
  • ప్రజలకు అవసరమైన వస్తు, సేవలను నాణ్యంగా, తక్కువ రేటులో అందించడం. ఇది భారతీయుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సాయపడుతుంది.
  • తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రం/ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దాని అభివృద్ధికి కృషి చేయడం. తద్వారా  ప్రాంతీయ అసమానతలు తగ్గేలా చూడటం
  • లాభాలు, పన్నులు, డివిడెండ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం.
  • వస్తు, సేవలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఇది భారత ఆర్థిక వ్యవస్థను బాహ్య ఒడిదొడుకుల నుంచి కాపాడి మరింత స్థితిస్థాపకత పొందేలా చేస్తుంది.

వర్గీకరణ

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

శాఖాపరమైన సంస్థలు (Departmental Undertaking): వీటిని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగం నేరుగా నిర్వహిస్తాయి. నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుంది.  

ఉదా: తంతి తపాలా, రైల్వే.

ప్రభుత్వ కార్పొరేషన్లు: ప్రత్యేక చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఈ సంస్థల నిర్వహణ విధానం, విధులు, అధికారాలు మొదలైనవన్నీ చట్టానికి లోబడి ఉంటాయి.

ఉదా: ఎల్‌ఐసీ, స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.

ప్రభుత్వ కంపెనీలు: కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం జాయింట్‌ స్టాక్‌ కంపెనీ పద్ధతిలో ఏర్పాటైన ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కంపెనీలు అంటారు. వీటిలో ప్రభుత్వం ఏకైక వాటాదారుగా లేదా అత్యధిక వాటాలు ఉన్న వాటాదారుగా ఉంటుంది.

ఉదా: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌.

చారిత్రక నేపథ్యం..

ప్రభుత్వ రంగ సంస్థల మధ్య పోటీని, సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1973, ఏప్రిల్‌ 10న స్టాండింగ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (స్కోప్‌)ను ఏర్పాటు చేసింది. 1976, నవంబరులో ఇది దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందింది. స్కోప్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం 2010, ఏప్రిల్‌ 10న మొదటిసారి ప్రభుత్వ రంగ దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు. ఈ రోజును పురస్కరించుకుని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ప్రభుత్వ రంగ సంస్థలకు స్కోప్‌ ఎమినెన్స్‌ అవార్డులను ప్రదానం చేస్తారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానాన్ని కింది ఏ సంవత్సరంలో ప్రకటించారు?

(హెచ్‌పీపీఎస్సీ జీఎస్, 2017),(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2025)

1) 1948   2) 1956

3) 1964   4) 1972

సమాధానం: 1

2. కింది ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేసి , దేశంలో వేగవంతమైన పారిశ్రామికీకరణను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు?

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)

1) మూడో పంచవర్ష ప్రణాళిక

2) అయిదో పంచవర్ష ప్రణాళిక

3) మొదటి పంచవర్ష ప్రణాళిక

4) రెండో పంచవర్ష ప్రణాళిక

సమాధానం: 4

3. భారత్‌లో ప్రభుత్వ రంగం కింది ఎందులో అత్యధిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారి కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023),(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2018)

1) రవాణా    2) ఉక్కు ఉత్పత్తి

3) వాణిజ్య బ్యాంకింగ్‌

4) వ్యవస్థీకృత కాల రుణాల ఆర్థిక సంస్థలు

సమాధానం: 3

4. Government PSE's are known by three names. Which of the following is NOT one of the names by which PSE's are identified?
(DFCCIL Jr. Executive (Operation and BD), 2021)

1) Miniratna    2) Pancharatna

3) Maharatna  4) Navratna

Ans: 2

5. Which among the following consists of businesses owned by individuals or a group of individuals?
(UPSSSC PET, 2022)

1) Public Sector   2) State-owned enterprise

3) Private Sector  4) None of these

Ans: 3

6. The second five-year plan introduced to the concept of public sector of state-run enterprises based on the ____________ model of industrialisation. 
(SSC JE Electrical, 2023)

1) Russian  2) French  3) German  4) Japanese

Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram