విద్యార్థులకు తాము చదువుతున్న మాధ్యమ భాషతోపాటు, మాతృభాషలోనూ పాఠాలు బోధించడం వల్ల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయని యునెస్కో వెల్లడించింది. ఏటా ఒక్కో అంశంపై ఈ సంస్థ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (సోర్) ఫర్ ఇండియా నివేదికను విడుదల చేస్తుండగా.. ఈసారి మాతృభాష, బహుళ భాషల్లో బోధనపై 2025 నివేదికను తాజాగా హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ప్రధానంగా తెలంగాణ, ఒడిశాలలో అమలుచేస్తున్న.. మాతృభాష, బహుళ భాషల్లో బోధన విధానాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. తమకు తెలిసిన భాషలో అయితే పిల్లలు క్రియాశీలకంగా చర్చల్లో పాల్గొంటారని నివేదిక పేర్కొంది.
జాతీయ నూతన విద్యావిధానం-2020 సైతం ఇంటి లేదా అమ్మ భాషలో చిన్నారులు భాష నేర్చుకుంటారని.. కనీసం ఐదో తరగతి వరకు, వీలుంటే 8వ తరగతి వరకు ఏ మాధ్యమంలో బోధిస్తున్నా, మాతృభాషలోనూ చదువులు చెప్పాలని సూచించడాన్ని ప్రస్తావించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది.