దేశంలో మొత్తం కుటుంబ వినియోగ వ్యయంలో ఆహార పదార్థాల వాటా 32.82 శాతానికి పరిమితమైందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా విభాగం విడుదల చేసిన ‘ఇండియాస్ కన్జంప్షన్ జర్నీ’ నివేదిక వెల్లడించింది. మిగిలిన దాదాపు 67 శాతం ఇతర వస్తువులు, సేవల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఎంపిక చేసిన ఆహార పదార్థాలపై కుటుంబాలు చేస్తున్న సగటు నెలవారీ ఖర్చులో సిక్కిం రూ.1,776తో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యయం రూ.979, తెలంగాణలో రూ.959గా నమోదైంది. ఒడిశాలో అత్యల్పంగా రూ.656 ఖర్చు చేస్తున్నారు. కొనుగోలు శక్తి, ఆహార ధరలు, ఆహారపు అలవాట్లలో వ్యత్యాసాలు ఇందుకు కారణమవుతున్నాయని నివేదిక పేర్కొంది.