పశ్చిమాసియా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం 2026-27 రబీ సీజన్‌కు ఎరువుల రాయితీ కోసం రూ.62,370 కోట్లు కేటాయించింది. 2025-26 రబీతో పోలిస్తే ఇది ఏకంగా 64 శాతం అధికం.
ప్రధాని మోదీ నేతృత్వంలో దిల్లీలో 2026, నవంబరు 11న సమావేశమైన క్యాబినెట్ ఈ మేరకు పలు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా రూ.77 వేల కోట్ల విలువైన పథకాలకు సమ్మతి తెలిపింది. రబీ సీజన్‌కు ఎరువులపై సబ్సిడీ 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.
దీనికింద కిలో నైట్రోజన్‌కు రూ.94.21, ఫాస్ఫరస్‌కు రూ.66.11, పొటాషియంకు రూ.2.38, సల్ఫర్ రూ.10.42 చొప్పున సబ్సిడీ అందజేస్తారు. 50 కిలోల డీఏపీ బస్తాను రూ.1,350కే అందించనున్నారు. 2025-26 రబీలో ఎరువుల రాయితీ కోసం రూ.37,952 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.24,418 కోట్లు కేటాయించారు.
2025, నవంబరు 10 నాటికి దేశంలో 173.46 లక్షల టన్నుల ఎరువుల నిల్వలుండగా.. ఈ ఏడాది (2026) అదే సమయానికి 235.11 లక్షల టన్నులు ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.