దేశంలో తయారయ్యే అన్ని కొత్త కారు మోడళ్లకు 2030 అక్టోబరు నుంచి అత్యవసర పరిస్థితిలో కారు సొంతంగా బ్రేక్ వేసుకునే విధానం (అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం-ఏఈబీఎస్) తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మోర్త్ ఈ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
‘‘ప్యాసింజర్, సరకు రవాణా వాహనాల్లో ఏఈబీఎస్ను ఇప్పటికే అమరుస్తుంటే 2028 అక్టోబరు 1 నుంచి విడుదలయ్యే వాహనాల్లో అది తప్పనిసరిగా ఏఐఎస్-185 ప్రమాణాలకు లోబడి ఉండాలి. 2030 అక్టోబరు 1 నుంచి కొత్త కారు మోడళ్లకు, 2032 అక్టోబరు 1 నుంచి అన్ని మోడళ్లకూ ఏఈబీఎస్ను తప్పనిసరి చేయాలి. ప్రయాణికుల వాహనాలను నడిపే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, రోడ్డుపై సరిగా దృష్టిసారించారా, లేదా... అని హెచ్చరించే వ్యవస్థను అమరుస్తుంటే 2027 అక్టోబరు 1 నుంచి అది ఏఐఎస్-184 ప్రమాణాల ప్రకారం ఉండాలి. 2029 అక్టోబరు 1 నుంచి అన్ని ప్రయాణికుల వాహనాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం తప్పనిసరి’’ అని స్పష్టం చేసింది.