అంగారకుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ ఆ గ్రహంపై ఏకంగా 45.22 కిలోమీటర్లు ప్రయాణించింది. మరో గ్రహంపై ఒక రోవర్ ప్రయాణించిన దూరం విషయంలో ఇదే రికార్డు. నాసాకే చెందిన ఆపర్చ్యునిటీ రోవర్ సాధించిన 45.19 కిలోమీటర్ల రికార్డును అక్టోబరు 11న అది బద్దలుకొట్టింది. అయితే ఈ ఘనత సాధించడానికి ఆపర్చ్యునిటీకి దాదాపు 15 ఏళ్ల సమయం పట్టింది. పర్సెవరెన్స్ మాత్రం ఐదున్నరేళ్లలోనే దీన్ని దాటేసింది.
కారు పరిమాణంలో ఉండే ఆరు చక్రాల పర్సెవరెన్స్ రోవర్ 2021 ఫిబ్రవరి 18న అంగారకుడిపైనున్న జెజెరో బిలంలో దిగింది. అక్కడ ఒకప్పుడు నది, చెరువు ఉండేవని ఆ ప్రదేశ తీరుతెన్నులు చెబుతున్నాయి. పర్సెవరెన్స్ సామర్థ్యం వల్ల జెజెరో బిలం, దాని చుట్టుపక్కల ఉన్న వైవిధ్యభరిత ప్రదేశాలకు వేగంగా చేరుకోవడానికి, వాటిపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు అవకాశం ఏర్పడింది. ఆ రోవర్ ఇప్పుడు తనకు నిర్దేశించిన కాలపరిమితిని మించి పనిచేస్తోంది. దీంతో 2028 చివరి వరకూ ఈ మిషన్‌ను పొడిగించాలని నాసా నిర్ణయించినట్లు తెలుస్తోంది.