భూమిపై అంతరించిపోయే ప్రమాద ముప్పును ఎదుర్కొంటున్న బట్టమేక పిట్ట జాతిని సంరక్షించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన ‘జంప్‌స్టార్ట్’ ప్రయత్నం ఫలించినట్టే ఫలించి.. విఫలమైంది. వినూత్న విధానం ద్వారా గుజరాత్‌లో దశాబ్దం తర్వాత పుట్టిన ఈ పక్షి పిల్ల గల్లంతైంది. దీన్ని ఏదైనా జంతువు తినేసి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఈ పక్షి జాతిని సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు వ్యూహాన్ని మార్చాల్సి వచ్చింది.
జంప్ స్టార్ట్..
నలియాలో బట్టమేక పిట్టల సంఖ్యను పెంచేందుకు ‘జంప్‌స్టార్ట్’ అనే విధానాన్ని అధికారులు అనుసరించారు. ఇందులో.. సంరక్షణ కేంద్రంలో ఫలదీకరణం చెందిన అండాన్ని అటవీ ప్రాంతానికి తరలిస్తారు. దాన్ని.. ఫలదీకరణం చెందని అండాలపై పొదిగిన ఒక ఆడ బట్టమేక పిట్ట గూడులో పెడతారు.
ఇలా పుట్టే పిల్లకు సరోగేట్ తల్లి ద్వారా రక్షణ అందించి, అడవిలో వాటి సంతతిని పెంచడం ఈ ప్రయోగం ఉద్దేశం.
జంప్‌స్టార్ట్‌లో భాగంగా 770 కిలోమీటర్ల దూరంలో.. రాజస్థాన్‌లోని ఒక సంరక్షణ కేంద్రంలో నుంచి ఫలదీకరణ చెందిన అండాలను గుజరాత్‌కు రప్పించారు. వీటిని తరలిస్తున్న వాహనం నాన్‌స్టాప్‌గా ప్రయాణించేందుకు రెండు రాష్ట్రాలు ప్రత్యేక కారిడార్‌ను కూడా ఏర్పాటు చేశాయి.
మగ పిట్ట తోడులేకపోవడం వల్ల నలియాలో ఓ బట్టమేక పక్షి అపరిపక్వ అండాన్ని పెట్టింది. మార్చి 22న అధికారులు దాన్ని తొలగించి.. రాజస్థాన్ నుంచి తెచ్చిన గుడ్డును ఆ గూడులో పెట్టారు. 2026, మార్చి 26న ఈ గుడ్డు నుంచి పక్షి పిల్ల పుట్టింది.
దశాబ్దం తర్వాత కచ్‌లో పుట్టిన బుట్టమేక పిట్ట పిల్ల కదలికలను నిశితంగా గమనించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 20న అది కొద్దిసేపు గగనవిహారానికి ప్రయత్నించింది. ఆ తర్వాత దాని ఆచూకీ లేదు. ఏదో ఒక జంతువు దాన్ని నోటకరచుకొని వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జంప్‌స్టార్ట్‌ను కొనసాగిస్తూనే.. భవిష్యత్‌లో ఈ పక్షుల పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పటిష్ఠంగా ఫెన్సింగ్ ఏర్పాటు, వీటిని వేటాడే జంతువులను వేరే ప్రాంతాలకు తరలించడం, నీటి నిర్వహణ విధానాలను అమలు వంటివి చేపట్టనున్నారు.