భారతదేశంలో డిజిటల్ మోసాల ముప్పు తీవ్రంగా పెరుగుతోందని క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్‌యూనియన్ ఇటీవల విడుదల చేసిన ‘టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్’ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, మన దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో మోసాల రేటు, అంతర్జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదైంది. లాజిస్టిక్స్, టెలికాం, బీమా రంగాల్లో ఈ ముప్పు అధికంగా ఉంది.
2025లో భారత వినియోగదారులు చేసిన మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 7.1% మోసపూరితమైనవిగా తేలాయి. అంతర్జాతీయంగా ఈ మోసాల రేటు కేవలం 3.8 శాతమే. గుర్తింపు ధ్రువీకరణ, అథెంటికేషన్ లోపాలను మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. రియల్-టైమ్ ఇంటరాక్షన్స్, నిరంతరం లావాదేవీలు జరిగే రంగాలను వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు.