ఆరో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6) ప్రకారం, దేశంలో ఊబకాయుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో మధుమేహులు కూడా అధికమవుతున్నారు. మునుపటి సర్వేతో పోలిస్తే అధికబరువున్న వారు... షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో పెద్దఎత్తున పెరుగుదల నమోదైంది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఇలాంటి సర్వే నిర్వహించటం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 2023-24లో 715 జిల్లాల్లో 6,79,000 ఇళ్ల నుంచి సేకరించిన సమాచారంతో దీన్ని రూపొందించారు
ఎత్తు, బరువు నిష్పత్తి(బీఎంఐ) 25, అంతకన్నా ఎక్కువుంటే అధిక బరువు, ఊబకాయంగా పరిగణిస్తారు. దీని ప్రకారం చూస్తే- ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5లో 15-49 ఏళ్ల మహిళల్లో 24 శాతం మంది అధిక బరువు, ఊబకాయులు కాగా.. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6లో ఇది 30.7 శాతానికి పెరిగింది. అంటే సుమారు ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు అధిక బరువుతో సతమతమవుతున్నవారు. మగవాళ్లలో ఇది 22.9 శాతం నుంచి 27.3 శాతానికి ఎగబాకింది. దీనర్థం ప్రతి నలుగురిలో ఒకరు కంటే ఎక్కువ మందే అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు.