అమెరికా ఎన్నికల్లో న్యూయార్క్ నగరంతోపాటు పలుచోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (34 ఏళ్లు) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. భారత్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మీ విజయం సాధించారు. సిన్సినాటి మేయర్‌గా భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు.
న్యూయార్క్ చరిత్రలో గత వందేళ్లలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా మమ్దానీ చరిత్ర సృష్టించారు. తొలి దక్షిణాసియావాసిగానూ ఆయన రికార్డు నెలకొల్పారు. న్యూయార్క్‌కు 111వ మేయర్‌గా 2026 జనవరిలో బాధ్యతలు చేపట్టనున్న మమ్దానీ 84 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించనున్నారు.