మహిళలు అన్ని రంగాల్లో భాగస్వాములైనప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది. పూర్వంతో పోలిస్తే స్త్రీలకు అనేక అవకాశాలు లభిస్తున్నా.. పురుషులతో సమానంగా హక్కులు పొందడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ కొన్ని సమాజాల్లో వివక్షకు గురవుతూ, చట్టపరమైన రక్షణ పొందలేక సామాజిక కట్టుబాట్లు - నిబంధనల నడుమ జీవిస్తున్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని విద్య, సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, సామాజిక సేవ లాంటి వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలు, వారి సహకారాలకు గుర్తుగా ఏటా మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’గా (International Women’s Day) నిర్వహిస్తారు. లింగ సమానత్వం, మహిళా హక్కుల గురించి అవగాహన కల్పించడంతోపాటు స్త్రీలు ఎదుర్కొనే వివక్ష, అసమాన అవకాశాలు, లింగ ఆధారిత హింస లాంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 1908లో 15వేల మంది మహిళలు తమ హక్కుల సాధన కోసం నిర్వహించిన మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తి. 1910లో కోపెన్‌హాగెన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సమావేశంలో జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ ‘విమెన్స్ డే’ అంశాన్ని లేవనెత్తారు. ఆవిడ సూచనను అన్ని దేశాలు ఏకగ్రీవంగా సమర్థించాయి. ఆ విధంగా మొదటి మహిళా దినోత్సవాన్ని 1911లో అనేక దేశాల్లో నిర్వహించారు.
2026 నినాదం: Rights. Justice. Action. For ALL Women and Girls
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పూర్తి సమాచారం ఈబుక్ రూపంలో ఈనాడు ఈప్రతిభ వాట్సాప్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. వెంటనే ఫాలో చేసి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రతి రోజూ ఉచితంగా అందుకోండి. https://hov.to/e05e8f1a