జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం

జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం

వ్యాధిని కట్టడి చేసి, రోగికి ఉపశమనం కలిగించడంలో ఔషధాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని తయారు చేసేవారే ఫార్మసిస్టులు. సురక్షితమైన, ప్రభావవంతమైన ఔషధ చికిత్సను నిర్ధారించడంలో వారి విద్యా నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఫార్మసీ విద్యకు పితామహుడిగా పేర్కొనే ప్రొఫెసర్‌ మహదేవ లాల్‌ ష్రాఫ్‌ (ఎం.ఎల్‌. ష్రాఫ్‌) జయంతి సందర్భంగా ఏటా మార్చి 6న ‘జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం’గా (National Pharmacy Education Day) నిర్వహిస్తారు. ప్రజారోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్రను గుర్తించడంతోపాటు వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

ఫార్మసీ అంటే?

  • వైద్య, రసాయనశాస్త్రాలను అనుసంధానించే క్లినికల్‌ హెల్త్‌సైన్స్‌ను ఫార్మసీ అంటారు. ఇందులో వైద్యపరంగా వ్యాధి నిర్ధారణకు, నిరోధించడానికి, నయం చేయడానికి వివిధ రకాల మందులు (డ్రగ్స్‌), ఔషధాలను (మెడిసిన్‌) తయారు చేస్తారు
  • వీటిని ప్రయోగశాలలో రూపొందిస్తారు. నాణ్యమైన ఔషధాలు, కొత్త ఫార్ములాల రూపకల్పనలో; వాటి మూల్యాంకనాన్ని అర్థం చేసుకోవడంలో ఫార్మసిస్టుల సేవలు అనివార్యం. 

భారతదేశంలో..

  • ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ఆరోగ్య రంగ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. అథర్వణవేదం భారతీయ వైద్యరంగ భాండాగారంగా ప్రసిద్ధి చెందింది.
  • ప్రాచీన కాలంలో వ్యాధి లక్షణాలు, తీవ్రతను బట్టి మూలికా వైద్యాన్ని అనుసరించేవారు. దీన్ని ఇప్పటికీ గ్రామాల్లో ఆచరిస్తున్నారు
  • సుశ్రుతుడి సుశ్రుత సంహిత, చరకుడు నిక్షిప్తం చేసిన చరక సంహిత భారత ప్రాచీన ఆయుర్వేద వ్యవస్థకు మార్గదర్శకాలుగా పేర్కొంటారు. వీటిలో వైద్యం, శస్త్రచికిత్స గురించిన అంశాలు ఉన్నాయి
  • శస్త్ర చికిత్సా నైపుణ్యాలు సైతం రెండు వేల సంవత్సరాలకు పూర్వమే భారతీయులకు తెలుసని, అవి భారత్‌ నుంచి మిగిలిన ఖండాలకు వ్యాపించాయని విశ్లేషకుల అభిప్రాయం.

మహదేవ లాల్‌

  • ఈయన 1902, మార్చి 6న బిహార్‌లోని దర్భంగాలో జన్మించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు
  • 1932లో ష్రాఫ్‌ బీహెచ్‌యూలో బీఎస్సీ ప్రోగ్రామ్‌లలో ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. ఈయన కృషి ఫలితంగానే 1940లో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మ్‌ విద్య ప్రారంభమైంది. తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలకు ఫార్మసీ విద్య విస్తరించింది.

నెలకొల్పిన సంస్థలు - ఇతర ముఖ్య విశేషాలు

  • ష్రాఫ్‌ 1935, డిసెంబరులో యునైటెడ్‌ ప్రావిన్స్‌ ఫార్మా అసోసియేషన్‌ను ప్రారంభించారు. 1939లో ఇది ఇండియన్‌ ఫార్మసీ అసోసియేషన్‌గా మారింది
  • 1945లో ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మసిస్ట్స్‌ను నెలకొల్పారు.
  • 1954-59 వరకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) అధ్యక్షుడిగా పనిచేశారు
  • 1965లో ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ను స్థాపించారు
  • 1980లో హిందీలో భైషాజ్‌ పత్రికను ఏర్పాటు చేశారు.
  • ష్రాఫ్‌ 1971 ఆగస్టు 25న మరణించారు.

చారిత్రక నేపథ్యం

  • భారతదేశ ఫార్మా రంగంలో అనేక సంస్కరణలకు ప్రొఫెసర్‌ మహదేవ లాల్‌ ష్రాఫ్‌ ఆద్యుడు. దేశంతో ఫార్మాస్యూటికల్‌ విద్య, దాని శాస్త్రీయ - సాంకేతిక అంశాల పురోగతిపై అవగాహన పెంచడంలో ఆయన గణనీయంగా కృషిచేశారు. దీంతో ఆయనకు ‘భారతీయ ఔషధ విద్య మార్గదర్శకుడు - పితామహుడు’ అనే బిరుదులు లభించాయి. దేశంలో ఫార్మసీ విద్య గురించి ప్రజలకు తెలియజేసినందుకు గుర్తుగా ఏటా ఆయన జయంతిని ‘జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం’గా జరుపుకోవాలని ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) తీర్మానించింది. 2023 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?(యూపీ పోలీస్‌ అసిస్టెంట్‌ ఆపరేటర్, 2024)

1) సెప్టెంబరు 25    2) మార్చి 6

3) జులై 22        4) డిసెంబరు 10

సమాధానం: 2

2. భారతదేశంలో ఫార్మసీ విద్యకు పితామహుడిగా కింది ఎవర్ని పిలుస్తారు?(ఈఎస్‌ఐసీ ఫార్మసిస్ట్‌ మెయిన్స్, 2019)

1) ఆర్‌ఎన్‌ చోప్రా            2) అసిమా ఛటర్జీ

3) హెచ్‌జీ ఖొరానా          4) ఎంఎల్‌ ష్రాఫ్‌

సమాధానం: 4

3. చరక సంహిత గ్రంథం ప్రకారం మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2019)

1) 206     2) 360        3) 370     4) 208

సమాధానం: 2

4. Which of the following are the reasons for the occurrence of multi-drug resistance in microbial pathogens in India? (UPSC Civil Services Examination, 2019)

1) Genetic predisposition of some people

2) Taking incorrect doses of antibiotics to cure diseases

3) Using antibiotics in livestock farming

4) Multiple chronic diseases in some people
Select the correct answer using the code given below.

1) 1 and 2            2) 2 and 3 only

3) 1, 3 and 4          4) 2, 3 and 4

Answer: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram