సముద్ర అంతర్భాగంలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు భారీ పరిమాణంలో ఎగసిపడి, తీర ప్రాంతానికి చేరడాన్ని సునామీ అంటారు. అత్యంత ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించి, తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి, పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే ప్రకృతి వైపరీత్యాల్లో సునామీ ఒకటి.
మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సుల్లోనూ సునామీలు ఏర్పడతాయి. ఈ విపత్తు గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 5న ‘ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం’గా (World Tsunami Awareness Day) నిర్వహిస్తారు. సునామీ సమయంలో ప్రభావ తీవ్రతను తగ్గించడం, సహజ సంసిద్ధతను మెరుగుపరచడం లాంటి విషయాలపై ప్రధానంగా ఈ రోజు దృష్టి సారిస్తుంది.
చారిత్రక నేపథ్యం
జపాన్ చారిత్రక ఇతివృత్తం ‘ఇనామురా నో హ (ది బర్నింగ్ ఆఫ్ ది రైస్ షీవ్స్)’ ఆధారంగా ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని’ ఏర్పాటు చేసింది. ఈ కథ ప్రకారం.. 1854, నవంబరు 5న హమాగుచి గోర్యో అనే రైతు సునామీ రాకను గుర్తించి, తన గ్రామంలోని ప్రజలను హెచ్చరించే ఉద్దేశంతో తన వరి పంటకు నిప్పు పెట్టాడు. అలా ఆ ప్రాంత జనాల్ని ప్రణనష్టం నుంచి కాపాడారు.
సునామీ గురించి అవగాహన కల్పించడంతోపాటు విపత్తు వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించే ఉద్దేశంతో యూఎన్ జనరల్ అసెంబ్లీ 2015, డిసెంబరులో ఏటా నవంబరు 5న ‘ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం’గా నిర్వహించాలని తీర్మానించింది. 2016 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.
2025 నినాదం: Be Tsunami Ready: Invest in Tsunami Preparedness