దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగినట్లు బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) నివేదిక వెల్లడించింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారినట్లు తెలిపింది.
2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్‌ఎస్‌ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా సగటున 22% వార్షిక వృద్ధితో ఇది సాధ్యమైందని చెప్పింది. 2005లో దేశ జీడీపీలో ఈ రంగం వాటా కేవలం 6 శాతమే కాగా, ఇప్పుడు 27 శాతానికి చేరుకుంది. బీఎఫ్‌ఎస్‌ఐ ఇప్పుడు దేశ ఆర్థిక శక్తికి ఎంతో కీలకమని నివేదిక స్పష్టం చేసింది.
బీఎఫ్‌ఎస్‌ఐ రంగం మొత్తం మార్కెట్ విలువలో 57% బ్యాంకులదే. 2005లో ఇది 85%. మిగిలిన వాటా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలు, ఏఎంసీలు, ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్తోంది. బీఎఫ్‌ఎస్‌ఐ షేర్లు ఎప్పటికప్పుడు మార్కెట్ వృద్ధిని మించి రాబడిని అందించాయి.