వాతావరణ మార్పులతో ముడిపడిన వేడిగాలులు అధికమవడం వల్ల భారత దేశం గత ఏడాది 24,700 కోట్ల పని గంటలను కోల్పోయిందని ఇటీవల విడుదలైన లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఇది ఆర్థికంగా రూ.17.11లక్షల కోట్ల (194 బిలియన్ డాలర్ల) ఆదాయాన్ని నష్టపోవడంతో సమానమని పేర్కొంది. ప్రతి భారతీయుడు 2024లో 420 పని గంటలను కోల్పోయాడని విశ్లేషించింది. ‘పర్యావరణ మార్పులు..ఆరోగ్యంపై ప్రభావం-2025’ పేరుతో ప్రచురించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నేతృత్వంలో...71 విద్యా సంస్థలు, ఐక్యరాజ్యసమితి సంస్థలకు చెందిన 128 మంది అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ నివేదిక రూపకల్పనలో భాగస్వాములయ్యారు.