లోక్‌పాల్‌

లోక్‌పాల్‌

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు వారి తరఫున చట్టసభల్లో ప్రవేశించి, పరిపాలన సాగిస్తారు. ఆ సభల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది. తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలైనప్పుడే పౌరులకు సరైన పాలన అందుతుంది. అలాకాకుండా నాయకులు, అధికారులు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే అది ప్రజాస్వామ్య విలువలకే ముప్పుగా పరిణమిస్తుంది. అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌ వ్యవస్థే లోక్‌పాల్‌. ఇది జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన అవినీతి నిరోధక సంస్థగా పనిచేస్తుంది. దీని నినాదం ‘పౌరులకు సాధికారత  కల్పించడం, అవినీతిని బహిర్గతం చేయడం  (Empower Citizens, Expose Corruption)’. పోటీపరీక్షల నేపథ్యంలో దీని గురిచిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

చారిత్రక నేపథ్యం - ఏర్పాటు

  • ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను 1809లో స్వీడన్‌లో ‘అంబుడ్స్‌మన్‌’ పేరుతో ఏర్పాటు చేశారు. దీని అర్థం ప్రజల న్యాయవాది.
  • మనదేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను విచారించేందుకు లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి సి.డి.దేశ్‌ముఖ్‌ ప్రతిపాదించారు.
  • 1963లో పార్లమెంట్‌ సభ్యుడు లక్ష్మీమాల్‌ సింఘ్వి లోక్‌పాల్‌ అనే పదానికి రూపకల్పన చేశారు.
  • 1966లో మొరార్జీ దేశాయ్‌ అధ్యక్షతన ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల కమిటీ లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
  • లోక్‌ అంటే ప్రజలు, పాల్‌ అంటే సంరక్షకుడు అని అర్థం.
  • లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంట్‌లో 8 సార్లు ప్రవేశపెట్టారు.
  • ప్రముఖ సామాజిక కార్యకత్త అన్నా హజారే 2011, ఏప్రిల్‌లో లోక్‌పాల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేశారు.
  • డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందింది. దీనికి 2014 జనవరి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలపడంతో 2014 జనవరి 16 నుంచి లోక్‌పాల్, లోకాయుక్త చట్టంగా అమల్లోకి వచ్చాయి.
  • మన దేశంలో ఏటా జనవరి 16న ‘లోక్‌పాల్‌ డే’గా నిర్వహిస్తారు.

నిర్మాణం - నియామకం

  • లోక్‌పాల్‌లో ఒక ఛైర్మన్, 8 మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది జ్యుడీషియల్‌ సభ్యులు కాగా, మిగిలిన సగం మంది పరిపాలన, అవినీతి నిర్మూలన, వివిధ రంగాల్లో అనుభవం ఉన్నవారై (నాన్‌ జ్యుడీషియల్‌) ఉంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళావర్గానికి చెందినవారై ఉండాలి.
  • లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
  • ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకం ఉంటుంది.

ఛైర్మన్, సభ్యులు

  • లోక్‌పాల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా నిష్ణాతుడైన వ్యక్తి అయిఉండాలి.
  • జ్యుడీషియల్‌ మెంబర్లుగా నియమితులయ్యే వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
  • నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యే వారు పరిపాలన, అవినీతి నిర్మూలన మొదలైన అంశాల్లో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండాలి.
  • లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 5 ఏళ్లు లేదా వారికి 70 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది (ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది).
  • ప్రస్తుతం లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావ్‌ ఖాన్విల్కర్‌ ఉన్నారు (2024, మార్చి 10 నుంచి 2026, జనవరి 17 నాటికి).

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: భారతదేశ మొదటి లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌ ఎవరు?

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)

1) అభిలాష కుమారి

2) ఇంద్రజీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌

3) దిలీప్‌ బి భోస్లే

4) పినాకి చంద్ర ఘోష్‌

సమాధానం: 4

ప్రశ్న: భారత్‌లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2025)

1) 2013, డిసెంబరు 17

2) 2011, జనవరి 16

3) 2014, జనవరి 16

4) 2013, జనవరి 16

సమాధానం: 3

Q: The creation of the institution of Lokpal was first recommended by
(NDA General Ability Test, 2017)
(UGC NET Paper 2, 2023)

1) Law Commission
2) Santhanam Committee
3) Shah Commission
4) Administrative Reforms Commission

Ans: 4

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram