సావిత్రీబాయి ఫూలే

సావిత్రీబాయి ఫూలే

భారతీయ సమాజంలో అనాదిగా ఉన్న అసమానతలను తొలగించి.. సమ సమాజం, సామాజిక అభివృద్ధి కోసం ఎందరో మేధావులు, సంఘసంస్కర్తలు అలుపెరుగని పోరాటాలు చేశారు. అంధ విశ్వాసాలు, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. ప్రజలను చైతన్యపరచడంలో తమ వంతు కృషి చేశారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సావిత్రీబాయి ఫూలే. జనవరి 3న సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా పోటీ పరీక్షల నేపథ్యంలో ఆమె గురించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

బాల్యం - వ్యక్తిగత జీవితం

  • సావిత్రీబాయి ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఖండాలా తాలూకా నైగావ్‌లో 1831, జనవరి 3న జన్మించారు. 
  • నాటి భారతీయ సమాజంలో అనేక వివక్షలు, అసమానతలకు తోడు స్త్రీలు చదువుకోకూడదు అనే నియమం ఉండేది. దీంతో ఆమె అక్షర జ్ఞానానికి దూరమైంది. సావిత్రికి చిన్నతనంలోనే వివాహమైంది. ఆమె భర్త జ్యోతిరావు ఫూలేకు చదువంటే మక్కువ. సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన విశ్వసించారు. ఇందుకోసం స్త్రీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. ఆయన సావిత్రీబాయికి ఇంటి వద్దే చదువు చెప్పడం ప్రారంభించారు. 
  • తానొక్కటే కాకుండా స్త్రీలందరూ విద్యావంతులు కావాలని ఆమె సంకల్పించారు. అందుకే  అహ్మద్‌ నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నారు. అణగారిన వర్గాల పిల్లలు చదువుకునేలా పుణెలోని భిడేవాడాలో భర్తతో కలిసి మొట్టమొదటి బాలికల పాఠశాలను నెలకొల్పారు. అందులోనే ఆమె టీచర్‌గా పనిచేశారు. ఆ విధంగా దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కారు. 
  • మహిళా విద్యను ప్రోత్సహిస్తూనే భర్తతో కలిసి లింగ వివక్ష, అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. 

కవిత్వం - పుస్తకాలు

  • ఆంగ్లేయుల నుంచి కవిగా గుర్తింపు పొందిన మొదటి భారతీయ మహిళ సావిత్రీబాయి ఫూలే. ఆమెను ఆధునిక కవిత్వానికి తల్లి (Mother of Modern Poetry) అంటారు. ఆమె తన కవితల్లో ముఖ్యంగా విద్య ప్రాముఖ్యతను తెలియజేశారు. 
  • 1854లో ‘కావ్యా ఫూలే’ అనే కవితా సంపుటిని, 1892లో ‘బవన్‌ కాశీ సుబోధ్‌ రత్నాకర్‌’ రచనను మరాఠా భాషలో ప్రచురించారు.
  • మహిళలపై జరిగే దారుణాలకు వ్యతిరేకంగా 1854లో ‘వారిని మనుషులు అని అనొచ్చా?’ (Should they be Called Humans?) అనే కవిత రాశారు.

ఇతర ముఖ్యాంశాలు

  • సావిత్రీబాయి, జ్యోతిరావు ఫూలే దంపతులకు పిల్లలు లేరు. వారు బ్రాహ్మణ వితంతువుకు జన్మించిన యశ్వంతరావును దత్తత తీసుకున్నారు. 
  • 1890, నవంబరు 28న జ్యోతిరావు ఫూలే మరణించారు. నాటి సామాజిక కట్లుబాట్లను ధిక్కరించి ఆయన చితికి ఆమె నిప్పు పెట్టారు.
  • 1893లో సాస్వద్‌ (మహారాష్ట్ర)లో జరిగిన సత్యశోధక్‌ సమాజం వార్షిక సమావేశానికి నాయకత్వం వహించారు.
  • 1997లో భారత ప్రభుత్వం సావిత్రీబాయి జ్ఞాపకార్థం తపాలాబిళ్లను విడుదల చేసింది. పుణె విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టింది. 
  • సావిత్రీబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025లో నిర్ణయం తీసుకుంది. 

మరణం

  • 1897లో ప్లేగు వ్యాధి మహారాష్ట్రను అతలాకుతలం చేసింది. బాధితులకు సాయం చేసేందుకు సావిత్రీబాయి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అనారోగ్యంబారిన పడిన పిల్లలను దగ్గరుండి చూసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకూ వ్యాధి సోకి 1897, మార్చి 10న మరణించారు. దేశంలో మహిళా అభ్యున్నతి అనగానే వెంటనే గుర్తొచ్చేది సావిత్రీబాయి పేరే. అంతగా ఆమె స్త్రీ ఉన్నతికి పాటుపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. నాటి సమాజంలోని దురాచారాలను ఎదుర్కోవడంలో తనదైన ముద్ర వేశారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(యూజీసీ నెట్‌ పేపర్‌ 2, 2019)

Q: కింది ఏ రంగంలో చేసిన కృషికి సావిత్రీబాయి ఫూలే పేరు పొందారు?

1) షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతి        2) పేదల అభ్యున్నతి

3) మహిళల విద్య                4) మురికివాడ పిల్లల విద్య

సమాధానం: 3

(ఏపీ టెట్‌ పేపర్‌ 2, 2018)

Q: భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు?

1) సావిత్రీబాయి ఫూలే            

2) తారాబాయి షిండే

3) బేగం రోకియా సఖావత్‌ హుస్సేన్‌

4) పండిట్‌ రమాబాయి సరస్వతి

సమాధానం: 1

(Maharashtra Police Constable (Ahmednagar) 2024)

Q: When was Savitribai Phule born?
1) 6 July 1837                2) 3 January 1831
3) 6 January 1812            4) 9 February 1823
Answer: 2

(UGC NET Paper 2, 2020)

Q: Savitribai Phule is known for her contribution in which of the following listed areas?
a) Peace Education
b) Art education
c) Education of the scheduled castes
d) Women education
e) Child care education
Choose the most appropriate answer from the options given below: 
1) a and d only            2) b and c only
3) a and c only            4) c and d only
Answer: 4
 
UPSC CSE, 2020

Q: What are the main factors responsible for gender inequality in India? Discuss the contribution of Savitribai Phule in this regard.  (150 words, 10 Marks)

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram