జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ)

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ)

మనిషి జీవితం ఊహాతీతం. ఎప్పుడు ఎలాంటి విపత్తులు ఎదురవుతాయో అంచనా వేయడం కష్టం. వాటివల్ల వ్యక్తికి ప్రాణ లేదా ఆస్తి నష్టం, అనారోగ్యం కలగొచ్చు. అలాంటి క్లిష్ట సమయాల్లో సంబంధిత వ్యక్తికి లేదా కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదే బీమా. ఇది ఒక సాంఘిక భద్రతా సౌకర్యం. ఆయా బీమా సంస్థలకు ఒకేసారి లేదా వాయిదా పద్ధతిలో ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకుంటారు. ఇన్సూరెన్స్‌లో జీవిత బీమా, సాధారణ బీమా అని రెండు రకాలు ఉంటాయి. ప్రాణ నష్టానికి సంబంధించింది జీవిత బీమా కాగా అనారోగ్యం, అనుకోని ప్రమాదాల వల్ల వ్యక్తులు, వాహనాలకు కలిగే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చేయించేది సాధారణ బీమా. ప్రస్తుత సమయాల్లో అందరికీ ఇది చాలా అవసరం. భారతదేశంలో సాధారణ బీమా వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ప్రాథమిక పునఃబీమా (రీఇన్సూరర్‌) సంస్థే జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ). పోటీ పరీక్షల నేపథ్యంలో దీని గురించిన ముఖ్య విషయలు తెలుసుకుందాం..!

జీఐసీ ఏర్పాటు

  • భారతదేశంలో మొట్టమొదటి సాధారణ బీమా సంస్థను 1850లో కలకత్తాలో ట్రియోటాన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనే పేరుతో ఏర్పాటు చేశారు.
  • 1906లో ఏర్పడిన యునైటెడ్‌ ఇండియా (మద్రాస్‌), నేషనల్‌ ఇన్సూరెన్స్‌ (కలకత్తా), కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ (లాహోర్‌) సాధారణ బీమా సంస్థలే.
  • 1907లో ఏర్పడిన ఇండియన్‌ మర్కంటైల్‌ కంపెనీ అన్ని రకాల బీమా వ్యాపారాలు నిర్వహించేది.
  • నాలుగో పంచవర్ష ప్రణాళికా సమయంలో (1969-74) జీఐసీ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి.
  • 1971లో అప్పటి వరకు ఉన్న సాధారణ బీమా కంపెనీల నిర్వహణను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం జనరల్‌ ఇన్సూరెన్స్‌ (ఎమర్జెన్సీ) ప్రొవిజన్స్‌ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.
  • 1972లో భారత పార్లమెంట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) చట్టాన్ని ఆమోదించింది. అదే ఏడాది నవంబరు 22న జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ) ఏర్పడింది.
  • 1973 జనవరి 1 నుంచి జీఐసీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనికి మొదటి ఛైర్మన్‌గా ఎ. రాజగోపాలన్, ఐఏఎస్‌ వ్యవహరించారు.
  • అదే సమయంలో దేశంలోని మొత్తం సాధారణ బీమా వ్యాపారాన్ని జాతీయం చేశారు. అంతవరకు దేశంలో పనిచేస్తున్న 107 సాధారణ బీమా సంస్థలను జాతీయం చేయగా, నాలుగు సంస్థలను విలీనం చేశారు. అవి:

 1. యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (మద్రాస్‌)

 2. న్యూ ఇన్సూరెన్స్‌ కంపెనీ (బొంబాయి)

 3. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (కలకత్తా)

 4. ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (న్యూదిల్లీ)

  • ఈ నాలుగు జీఐసీకి అనుబంధ సంస్థలుగా మారాయి.
  • 2000 నవంబరు నుంచి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (జీఐసీ) రీఅస్యూరర్‌గా (జీఐసీ ఆర్‌ఈ) పనిచేస్తోంది.
  • 2003లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఐసీకి అనుబంధంగా ఉన్న నాలుగు సంస్థలను దాని నుంచి వేరు చేసింది. వాటిని ప్రభుత్వ ప్రత్యక్ష యాజమాన్యంలోకి తీసుకుంది.

విధులు

  • భారతదేశంలో పని చేస్తోన్న జీవిత, జీవితేతర బీమా సంస్థలకు పునఃబీమా మద్దతు ఇవ్వడం.
  • పెద్ద మౌలిక సదుపాయాలు, విమానయానం, సముద్ర, ఇంధన నష్టాలకు ప్రత్యేక ఇన్సూరెన్స్‌ కవరేజీ అందించడం.
  • ప్రభుత్వ మద్దతు ఉన్న బీమా పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాలకు చేయూత అందించడం.

ఇతర ముఖ్యాంశాలు

  • ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
  • ప్రస్తుతం హితేష్‌ రమేష్‌ చంద్ర జోషి జీఐసీ ఆర్‌ఈకి తాత్కాలిక ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు (2025, అక్టోబరు 1 నుంచి 2026 జనవరి 2 నాటికి)
  • మన దేశంలో బీమా రంగాన్ని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నియంత్రిస్తుంది. 

 గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ) ఎప్పుడు ఏర్పడింది?

(ఎన్‌ఐఏసీఎల్‌ అసిస్టెంట్‌ మెయిన్స్, 2018),

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2021)

1) 2000          2) 2004        

3) 1972          4) 1978

సమాధానం: 3

ప్రశ్న: కిందివాటిలో ఏది బీమాకు సంబంధించిన పదం కాదు?

(ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్, 2024)

1) ప్రీమియం        2) అండర్‌ రైటింగ్‌

3) క్లెయిమ్‌            4) డివిడెండ్‌

5) అమోర్టైజేషన్‌

సమాధానం: 5

Q: In which year the General Insurance Corporation (GIC) subsidiaries were restructured as independent companies and at the same time GIC was converted into a national re-insurer?
(NIACL AO Mains, 2019)
1) 1999          2) 2000        

3) 2001         4) 2002
Ans: 2
Q: Which was the first company to transact all classes of general insurance business in India?
(UGC: Commerce, 2019)
1) Oriental Insurance Company Ltd 
2) Triton Insurance Company Ltd
3) Indian Mercantile Insurance Ltd
4) Bombay Mutual Insurance
5) None of these
Ans: 3

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram