ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్థాపకులు శిబూ సోరెన్ (81) 2025, ఆగస్టు 4న దిల్లీలో మరణించారు. అవిభాజ్య బిహార్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లా నెమ్రా గ్రామంలో 1944, జనవరి 11న జన్మించిన శిబూ సోరెన్ గిరిజనోద్యమానికి జాతీయ గుర్తింపు తెచ్చిన నాయకుడు. దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1973లో జేఎంఎం స్థాపించారు. ఆ సంస్థ చేపట్టిన ఉద్యమం కారణంగా 2000 సంవత్సరం నవంబరు 15న ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది.
• శిబూ సోరెన్ యూపీఏ హయాంలో మూడుసార్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. మూడు పర్యాయాలు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా (2005, 2008-09, 2009-10) కూడా విధులు నిర్వహించారు. ఈయన తన జీవితకాలంలో 8 సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.