జాతీయ మహిళా దినోత్సవం

జాతీయ మహిళా దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకుండా మన దేశంలోనూ ప్రత్యేకంగా మహిళల కోసం ఒక రోజును కేటాయించారు. ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలైన సరోజినీ నాయుడు మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక. ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’గానూ ఆమె ప్రసిద్ధి. మహిళా సాధికారతకు సరోజినీ నాయుడు చేసిన కృషికి గుర్తుగా ఆమె జయంతి రోజైన ఫిబ్రవరి 13న ‘జాతీయ మహిళా దినోత్సవం’గా (National Women’s Day) నిర్వహిస్తారు. సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతోపాటు దేశ భవిష్యత్తును రూపొందించడంలో కీలకమైన వారి పాత్ర గురించి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

సరోజినీ నాయుడు

  • ఈమె 1879, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించారు. వీరి కుటుంబం బెంగాల్‌ నుంచి ఇక్కడికి వలస వచ్చింది. చిన్నతనం నుంచే ఆమెకు కవితలు రాయడం అంటే ఇష్టం. చదువులోనూ ముందుండేవారు.
  • 12 ఏళ్ల వయసులో మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. 13 ఏళ్ల వయసులో ఆమె ‘లేక్‌ గర్ల్స్‌’ అనే కవిత రాశారు.
  • ఆ సమయలోనే సరోజిని రచించిన ‘మహర్‌ మునీర్‌’ నాటకం ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌కు బాగా నచ్చడంతో, 1895లో విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఉపకార వేతనం మంజూరు చేశాడు. దీని సాయంతో ఆమె లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌లో చేరారు. అక్కడే ఆమెకు పెద్దిపాటి గోవిందరాజులు నాయుడితో పరిచయం ఏర్పడి, 1898లో వివాహం చేసుకున్నారు. వారి కులాంతర వివాహం నాటి సమాజంలో చర్చనీయాంశమైంది.  

రాజకీయ ప్రస్థానం - ముఖ్య కార్యక్రమాలు

  • విదేశాల్లో చదువుకుంటున్న సమయంలోనే ఆమె భారత్‌ వచ్చి ప్రజాసేవ చేయాలని భావించారు. ముఖ్యంగా ఇక్కడి మహిళల స్థితిగతులు, వారిపై జరుగుతోన్న దౌర్జన్యాలు, లింగ అసమానతలు మొదలైనవి సరోజినిని ఎంతగానో ప్రభావితం చేశాయి. వాటిని రూపుమాపి సమాజంలో చైతన్యం తీసుకురావాలనుకున్నారు. అలా 1898లో ఆమె భారత్‌కి  తిరిగి వచ్చారు.
  • 1905లో జరిగిన బెంగాల్‌ విభజన ఆమెను జాతీయోద్యమ దిశగా నడిపించింది.  గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్‌ ఠాగూర్, అనిబిసెంట్‌ లాంటి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
  • గోపాలకృష్ణ గోఖలే సూచనతో 1905లో ఆమె కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్నారు. అలా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది.
  • 1915-18 కాలంలో ఆమె దేశవ్యాప్తంగా పర్యటించి జాతీయవాదం, మహిళా సాధికారత, సామాజిక సంక్షేమం గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.
  • గాంధీజీ అహింసా సిద్ధాంతాలను, భారత జాతీయ పోరాటాలను విదేశాల్లో వ్యాప్తి చేసే ఉద్దేశంతో 1928-29 కాలంలో అమెరికా, యూరోపియన్‌ దేశాలు పర్యటించారు.
  • దక్షిణాఫ్రికాలో 1929లో తూర్పు ఆఫ్రికన్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

చారిత్రక నేపథ్యం

  • స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు స్త్రీ సమానత్వం, హక్కులపై నినదించిన మహోన్నత వ్యక్తుల్లో సరోజినీ నాయుడు ఒకరు. మహిళలను చిన్నచూపు చూసేలా నాటి సమాజంలో పేరుకుపోయిన అంధవిశ్వాసాలను ఆమె ప్రశ్నించారు. దేశమంతా తిరిగి ప్రజల్లో చైతన్యం నింపారు. తన రచనలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం సరోజిని చేసిన కృషికి గుర్తుగా ఏటా ఆమె జయంతి రోజున మన దేశంలో ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరపాలని 2014లో ప్రభుత్వం తీర్మానించింది. ఆ ఏడాది ఆమె 135వ పుట్టిన రోజు కూడా. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న దీన్ని నిర్వహిస్తున్నారు.
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న జరుపుతారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018), (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2021)

1) ఫిబ్రవరి 10            2) ఫిబ్రవరి 11

3) ఫిబ్రవరి 12            4) ఫిబ్రవరి 13

సమాధానం: 4

2. సరోజినీ నాయుడుకి ‘భారత కోకిల’ అనే బిరుదు ఎవరు ఇచ్చారు?

(ఎంపీపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 2022)

1) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌        2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) మహాత్మా గాంధీ        4) గోపాలకృష్ణ గోఖలే

సమాధానం: 3

3. Who of the following is the author of a collection of poems called “Golden Threshold”? (UPSC Prelims 2009)
1) Aruna Asaf Ali        2) Annie Besant
3) Sarojini Naidu        4) Vijayalakshmi Pandit
Ans: 3
4. Consider the following statements: 
(UPSC Prelims 2015)
1) The first woman President of the Indian National Congress was Sarojini Naidu.
2) The first Muslim President of the Indian National Congress was Badruddin Tyabji.
Which of the statements given above is/are correct?
1) 1 only            2) 2 only
3) Both 1 and 2        4) Neither 1 nor 2
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram