బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ముఖ్య వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. భారతీయులందరూ ప్రేమతో ఈయన్ను నేతాజీ అని పిలుస్తారు. దేశ స్వరాజ్య సాధనకు సాయుధ పోరాటమే మార్గమని ఆయన విశ్వసించారు. తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపి ఆంగ్లేయులను తరిమికొట్టేలా ప్రేరేపించారు. స్వతంత్ర భారతావనిని సాధించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రత్యేక ప్రభుత్వాన్ని స్థాపించారు. భారత ప్రజల విశేష ఆదరాభిమానాలు పొందిన సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23న దేశవ్యాప్తంగా ఏటా ‘పరాక్రమ్ దివస్’గా నిర్వహిస్తారు. దేశ పౌరుల్లో దేశభక్తిని పెంపొందించడంతోపాటు కష్ట సమయాల్లో యువత ధైర్య, సాహసాలతో ఉండేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
సుభాష్ చంద్రబోస్
- బోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో జన్మించారు.
- 1920లో సివిల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టంలేక బోస్ ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు.
- గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలోకి వచ్చారు. 1921లో కాంగ్రెస్‌లో చేరారు.
- చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీ (1922) స్థాపన, దాని నిర్వహణలో బోస్ సహాయం చేశారు.
- 1938లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఉన్న హరిపుర గ్రామంలో జరిగింది.
- 1939లో త్రిపురిలో (ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పుర్ జిల్లాలో ఉంది) జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్ష పదవికి బోస్ పోటీ చేశారు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించారు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 1939, మే 3న ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీని స్థాపించారు. 1940లో దీని మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది.
- రెండో ప్రపంచ యుద్ధం (1939-45)లో బ్రిటిషర్లకు భారతీయులు సహకరించకూడదని సూచించారు. దీంతో ప్రభుత్వం 1940లో ఆయన్ను అరెస్ట్ చేసి, గృహ నిర్బంధంలో ఉంచింది. 1941లో ఆయన దీన్నుంచి తప్పించుకుని జర్మనీలోని బెర్లిన్ చేరారు. అక్కడి నుంచి జపాన్ వెళ్లారు.
ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన
- రాస్ బిహారీ బోస్ ప్రోత్సాహంతో భారత స్వాతంత్య్ర లీగ్ అధ్యక్ష పదవిని, మోహన్‌సింగ్ నుంచి భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) బాధ్యతలను బోస్ చేపట్టారు. తర్వాత ఐఎన్‌ఏ పేరును ‘ఆజాద్ హింద్ ఫౌజ్’గా మార్చారు.
- బోస్ సైన్యాన్ని అయిదు రెజిమెంట్లుగా విభజించారు. వాటికి గాంధీ, నెహ్రూ, ఆజాద్, ఝాన్సీరాణి, బోస్ రెజిమెంట్స్ అని పేర్లు పెట్టారు.
- 1945లో బోస్ జపాన్ విమానంలో పైగాస్, ఫార్మోసా మీదుగా టోక్యో బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు జపాన్ రేడియో ప్రకటించింది.
చారిత్రక నేపథ్యం
- దేశ యువతలో స్వాతంత్య్ర కాంక్షను రగల్చడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల పోరాట పటిమను తెలియజేసిన వ్యక్తిగా సుభాష్ చంద్రబోస్ చరిత్రకెక్కారు. తన సిద్ధాంతాలు, ఆశయాలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపారు. జాతీయోద్యమంలో ఆయన పాత్రను గౌరవించుకునే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2021లో ఆయన జన్మదినమైన జనవరి 23న ‘పరాక్రమ్ దివస్’గా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, 2022)
Q: కింది ఎవరి జయంతి సందర్భంగా ఏటా జనవరి 23న ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటారు?
1) లాలాలజపతి రాయ్ 2) నేతాజీ సుబాష్ చంద్రబోస్
3) భగత్‌సింగ్ 4) రాణి లక్ష్మీబాయి
సమాధానం: 2
(ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శి, 2016)
Q: భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) మొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు?
1) మోహన్ సింగ్ 2) సుభాష్ చంద్రబోస్
3) ప్రీతమ్ సింగ్ 4) రాస్ బిహారీ బోస్
(RPF Constable (2019)
Q: Azad Hind Fauj was also known as....
1) East India Association 2) Indian National Army
3) Indian National Congress 4) Theosophical Society
Answer: 2
(SSC CGL 2022)
Q: On 21 October 1943, Subhash Chandra Bose proclaimed the formation of the Provisional Government of Free India in ________.
1) Singapore 2) Russia 3) Japan 4) Germany
Answer: 1