ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే నాలుగో శక్తిమంతమైన సైన్యంగా గుర్తింపు పొందింది. ఇది భారత రక్షణ దళాల భూతల విభాగం. త్రివిధ దళాల్లో (సైన్యం, వైమానిక దళం, నౌకాదళం) భారత సైన్యం అతిపెద్దది. సరిహద్దుల వెంట దేశ భూభాగాలకు రక్షణ కల్పిస్తూ, ఉగ్రమూక చొరబాట్లను అడ్డుకోవడం వీరి బాధ్యత. జాతీయ భద్రతను కాపాడటం వీరి ప్రథమ కర్తవ్యం. భారత సైన్యం అందించే నిస్వార్థమైన సేవలను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 15న భారత సైనిక దినోత్సవం (ఇండియన్ ఆర్మీ డే)గా నిర్వహిస్తారు. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలను గౌరవించడంతోపాటు వారికి నివాళి అర్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
స్వాతంత్య్రానికి ముందు భారత సైన్యం
- దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు భారత సైన్యం బ్రిటిష్ వారి అధీనంలోనే ఉండేది. ఇందులో స్థానికులతోపాటు ఆంగ్లేయ అధికారులు ఉండేవారు.
- ఈస్ట్ ఇండియా కంపెనీ 1776లో కోల్‌కతాలో మొదటిసారి ఒక సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
- 1895, ఏప్రిల్ 1న బెంగాల్, బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీ సైన్యాలను విలీనం చేసి భారత సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని పంజాబ్ (వాయవ్య సరిహద్దు); బెంగాల్; మద్రాస్ (బర్మాతో కలిపి); బొంబాయి (సింధ్, క్వెట్టా, ఏడెన్‌తో కలిపి) అనే నాలుగు కమాండ్‌లుగా విభజించారు.
- బ్రిటిష్ భారత సైన్యం ఆంగ్లో - బర్మీస్ యుద్ధాలు, ఆంగ్లో - సిక్కు యుద్ధాలు, ఆంగ్లో - ఆఫ్గన్, నల్లమందు యుద్ధాలు, చైనాలో బక్సర్ తిరుగుబాటు (1899 - 1901) లాంటి అనేక యుద్ధాల్లో పాల్గొంది.
- 1947లో దేశానికి స్వాతంత్య్రంతోపాటు భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. రెండు దేశాల మధ్య బలగాల విభజనను పర్యవేక్షించేందుకు బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ సహా ఇతర అధికారులు కమాండ్‌లో కొనసాగారు. చివరి బ్రిటిష్ కమాండర్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి 1949లో భారతదేశానికి చెందిన ఎం.కరియప్ప భారతీయ సైనిక కమాండ్ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.
భారత సైన్యంలోని ప్రధాన విభాగాలు
- విభిన్న యుద్ధ వ్యూహాలు అమలు చేసేందుకు, సరిహద్దు భాగాలను సమగ్రంగా రక్షించేందుకు భారత సైన్యం ప్రత్యేక యూనిట్లు, రెజిమెంట్‌లను కలిగి ఉంది. వాటిలో ముఖ్యమైనవి
- పదాతిదళం (Infantry): ఇదే సైన్యంలో పెద్ద శాఖ. ఇందులో కాలినడకన పోరాడే సైనికులు ఉంటారు. గూర్ఖా రైఫిల్స్, రాజ్‌పుతానా రైఫిల్స్, సిక్కు రెజిమెంట్, పారాచూట్ రెజిమెంట్ లాంటివి ఇందులో భాగం. ఇది ఇండియన్ ఆర్మీకి వెన్నెముక లాంటిది.
- ఆర్మ్‌డ్ కార్ప్స్: ఇది భారత సైన్యానికి కీలకమైన యాంత్రిక పోరాట విభాగం. దీన్ని కింగ్ ఆఫ్ బ్యాటిల్‌ఫీల్డ్ అంటారు. టీ-90 భీష్మా, అర్జున్ ఎంబీటీ లాంటి ప్రధాన యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు ఇందులో ఉంటాయి.
- ఆర్టిలరీ: ఇది సైన్యానికి మందుగుండు సామగ్రి అందించే విభాగం. బోఫోర్స్ గన్స్, పినాకా ఎంబీఆర్‌ఎల్, బ్రహ్మోస్ లాంటి అధునాతన వ్యవస్థలను ఇది నిర్వహిస్తుంది.
చారిత్రక నేపథ్యం
- 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులు, కారణాల వల్ల బ్రిటిష్‌వారే ఆర్మీ చీఫ్‌గా కొనసాగారు. 1949 జనవరి 15న భారతదేశానికి చెందిన ఫీల్డ్ మార్షల్ ఎం.కరియప్ప మొట్టమొదటిసారిగా ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 15వ తేదీని ‘ఇండియన్ ఆర్మీ డే’గా నిర్వహిస్తున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: భారతదేశంలో కింది ఏ తేదీన సైనిక దినోత్సవంగా జరుపుకుంటారు?
(ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ వై, 2020), (ఈఎస్‌ఐసీ యూడీసీ, 2022)
1) డిసెంబరు 4
2) అక్టోబరు 8
3) జనవరి 1
4) జనవరి 15
సమాధానం: 4
ప్రశ్న: భారత సైన్యం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, 2018)
1) చెన్నై
2) కోల్‌కతా
3) న్యూదిల్లీ
4) దెహ్రాదూన్
సమాధానం: 3
Q. In which year Indian army was established?(CISF Constable (Fireman), 2023)
1) 1895
2) 1900
3) 1905
4) 1947
Answer: 1