జాతీయ యువజన దినోత్సవం

జాతీయ యువజన దినోత్సవం

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకే ఉంది. దేశ ప్రగతిలో వీరి పాత్ర ఎనలేనిది. కుల, లింగ, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడంలో; ప్రజలకు మంచి పాలన అందించడంలో; ఆర్థిక వృద్ధి సాధనలో యువతరం భాగస్వామ్యం కీలకం. జాతీయ శ్రేయస్సులో యువత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా (National Youth Day) నిర్వహిస్తారు. స్వామి వివేకానంద జయంతి కూడా ఈరోజే! సమాజ హితం పట్ల యువకుల్లో స్ఫూర్తి నింపేలా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

యువత అంటే?

  • నేషనల్‌ యూత్‌ పాలసీ 2003 ప్రకారం, 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిని మన దేశంలో యువతగా పేర్కొంటారు. జాతీయ అభివృద్ధిలో క్రియాశీల భాగస్వాములుగా వీరిని నిర్వచించారు. 
  • ఇతరులపై ఆధారపడే బాల్య దశ నుంచి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగే సమాజ సభ్యులే యువత. వీరిని ‘రోజూ కష్టపడి పనిచేసే (వర్కింగ్‌ గ్రూప్‌)’గా సూచిస్తారు. చదవడం, ఉద్యోగం/ ఉపాధి, బాధ్యతలు లాంటివి ఇందులో భాగంగా ఉంటాయి.  
  • అయితే ప్రస్తుతం అనేక దేశాల్లో యువతరం సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా పెరుగుతోంది. జనన, మరణాల రేటు తగ్గడంతోపాటు అనేక ఆర్థిక, సామాజిక అంశాలు దీనికి కారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.

గణాంకాలు

  • ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా స్థితి నివేదిక’ ప్రకారం, 2024లో జపాన్‌లో శిశు జననాలు 7,20,988గా నమోదయ్యాయి. 1899 తర్వాత అక్కడ ఇంత తక్కువగా జననాలు నమోదవడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్‌లోనూ 2023 నుంచి జననాల రేటు గణనీయంగా పడిపోవడం మొదలైంది. చైనాలో వరుసగా మూడేళ్లు జననాల రేటులో తగ్గుదల నమోదైంది. 
  • ఐరాస ప్రకారం, భారత జనాభా 146 కోట్లు. అయితే జనాభాను ఇదే స్థాయిలో కొనసాగించడానికి అవసరమైన జననాల పెరుగుదల కంటే దేశంలో జననాలు తక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది. దేశంలో జననాల రేటు సరాసరి ప్రతి మహిళకు 1.9కి పడిపోయిందని పేర్కొంది. దేశ జనాభాలో 68 శాతం మంది పనిచేసే వయసులో ఉన్నారు. 65 సంవత్సరాలకు మించిన వయసున్న జనాభా 7%. రానున్న దశాబ్దాల్లో ఈ వయోజన జనాభా పెరగనుందని నివేదిక తెలిపింది.

స్వామి వివేకానంద

  • స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్‌ దత్‌. 1863, జనవరి 12న కలకత్తాలో జన్మించారు. సాంఘిక, మత రంగాల్లో గొప్ప సంస్కర్త ఈయన. భారతీయ ఉపనిషత్తుల్లోని బోధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేశారు.
  • 1893 సెప్టెంబరు 11న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించి, హైందవ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశాడు. ‘నేను సోషలిస్ట్‌ను’ అని ప్రకటించుకున్న తొలి భారతీయుడు వివేకానందుడే. 
  • 1897లో స్వామి వివేకానంద కలకత్తాలోని బేలూర్‌లో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. తన గురువైన రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేయడానికి దీన్ని నెలకొల్పారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే రామకృష్ణ పరమహంస సందేశం రామకృష్ణ మిషన్‌ నినాదం.
  • భారతదేశ యువతను జాతీయ చైతన్యం పెంపొందించుకునేలా చేసి ‘ఆధునిక జాతీయతా పితామహుడు’గా పేరొందారు. వివేకానందుడు 1902, జులై 4న మరణించారు. 

చారిత్రక నేపథ్యం

  • యువతలో ఉత్తేజాన్ని నింపి, వారు సన్మార్గంవైపు పయనించేలా చేయడంలో వివేకానంద బోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి. తరాలు మారినా ఆయన సందేశాలు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నాయి. నిస్వార్థంగా దేశసేవకు అంకితం అవ్వండి అని ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. యువతలో వివేకానంద ఆలోచనలు, తత్వాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆయన జన్మదినమైన జనవరి 12న ఏటా ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1984లో ప్రకటించింది. 1985 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018)

Q: భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

1) జులై 12                2) డిసెంబరు 15

3) జనవరి 12            4) నవంబరు 12

సమాధానం: 3

(ఎస్‌ఎస్‌సీ, సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2021)

Q: స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?

1) 1897    2) 1899        3) 1882    4) 1876

సమాధానం: 1

(UPSC Civil Services Exam 2018)

Q: With reference to Pradhan Mantri Kaushal Vikas Yojana, consider the following statements:
1. It is the flagship scheme of the Ministry of Labour and Employment
2. It, among other things, will also impart training in soft skills, entrepreneurship, financial and digital literacy.
3. It aims to align the competencies of the unregulated workforce of the country to the National Skill Qualification Framework.
Which of the statements given above is/are correct?
1) 1 and 3 only            2) 2 only
3) 2 and 3 only            4) 1, 2 and 3
Answer: 3

(RRB NTPC Graduate Level CBT-I, 2025),

Q: In January 2025, National Youth Day was celebrated to mark the birth anniversary of which Indian leader?
1) Rabindranath Tagore            2) Raja Rammohan Roy
3) Subhas Chandra Bose            4) Swami Vivekananda
Answer: 4

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram