ప్రవాసీ భారతీయ దివస్‌

ప్రవాసీ భారతీయ దివస్‌

భారతదేశంలో పుట్టి చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాల్లో స్థిరపడిన వారిని ప్రవాసులుగా పేర్కొంటారు. విదేశాల్లోని భారత సంతతి వ్యక్తులకు పుట్టిన సంతానాన్ని కూడా ప్రవాస భారతీయులుగానే పరిగణిస్తారు. దేశాభివృద్ధిలో వీరి పాత్ర ఎనలేనిది. వారు ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశంలోని తమ బంధువులు, స్నేహితులకు డబ్బు పంపుతుంటారు. తద్వారా విదేశీ మారక నిల్వలు పెరిగి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తోడ్పడుతున్నారు. విదేశాల్లో నివసిస్తోన్న భారతీయుల సహకారాన్ని గుర్తించి, గౌరవించే లక్ష్యంతో మన దేశంలో జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్‌’గా (Pravasi Bharatiya Divas) నిర్వహిస్తున్నారు. దీన్నే నాన్‌-రెసిడెంట్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ) డే అని కూడా పిలుస్తారు. ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రవాసులకు, భారత ప్రభుత్వానికి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు తమ మూలాలు, సంస్కృతితో వారిని అనుసంధానం చేయడంపై ఈ రోజు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 

ప్రవాసులు - వర్గీకరణ

  • విదేశాల్లో నివసించే భారతీయులను భారత ప్రభుత్వం కింది రకాలుగా వర్గీకరించింది. 
  • నాన్‌-రెసిడెంట్‌ ఇండియన్స్‌: విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు. 
  • ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ): పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 7ఎ కింద నమోదు చేసుకున్న భారత మూలాలున్న విదేశీ పౌరులు. 1950, జనవరి 26 తర్వాత భారత్‌ నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారు, వారి సంతతి ఓసీఐ నమోదుకు అర్హులు. వారికే కార్డులు ఇస్తారు. 
  • భారత  పౌరసత్వ చట్టం 2003 ప్రకారం, ఓసీఐ కార్డుకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం సదరు వ్యక్తి 275 అమెరికన్‌ డాలర్లు చెల్లించాలి. కార్డు కాలపరిమితి జీవితాంతం ఉంటుంది. వారు వీసా లేకుండా భారత్‌కు రావొచ్చు. 
  • ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ)గా అయిదేళ్లు నమోదైన వ్యక్తి రెండేళ్లు భారత్‌లో సాధారణ జీవితాన్ని గడిపితే వారికి భారత పౌరసత్వం ఇస్తారు. 
  • భారత సంతతి వ్యక్తులు (పీఐఓ): భారత్‌లో జన్మించిన వారు లేదా భారత సంతతి వ్యక్తులు స్వదేశీ పౌరసత్వాన్ని వదిలి, ఇతర దేశాల సిటిజన్‌షిప్‌ను తీసుకుంటే వారిని పీఐఓ అంటారు. 

ప్రవాసులు - గణాంకాలు.. 

  • మన దేశం నుంచి అత్యధిక జనాభా అమెరికాకు వలస వెళ్తోంది. భారత్‌కు చెందిన సుమారు 54 లక్షలమంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభా 34.8 కోట్లు కాగా, అందులో వలస భారతీయుల వాటా 1.6%. ఈ జాబితాలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రెండో స్థానంలో (35,68,848) నిలిచింది. మలేసియా (29,14,127) మూడో స్థానంలో ఉంది. 
  • ప్రవాస భారతీయులు అధికంగా యూఏఈ (35,54,274), సౌదీ అరేబియా (24,60,603), అమెరికా (20,77,158)లో ఉన్నారు. 
  • మారిషస్‌లో 66% భారతీయ మూలాలున్న ప్రజలే నివసిస్తున్నారు. 
  • ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపిస్తున్నవారిలోనూ మనవాళ్లే మొదటి స్థానంలో ఉన్నారు. 2024లో ప్రవాస భారతీయులు దాదాపు 129 బిలియన్‌ డాలర్ల నుంచి 135 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లను పంపారు. కుటుంబానికి ఆర్థిక చేయూత, రియల్‌ ఎస్టేట్, పెట్టుబడులు మొదలైనవాటితో అవి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చేయూతనిచ్చాయి.

చారిత్రక నేపథ్యం

  • భారత స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన ప్రముఖుల్లో ఒకరైన మహాత్మా గాంధీ స్వరాజ్య పోరాటంలో చేరడానికి ముందు కొంతకాలం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. 1915, జనవరి 9న గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏటా ఆ తేదీన ‘ప్రవాసీ భారతీయ దివస్‌’గా జరుపుకోవాలని 2003లో నాటి వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి 2014 వరకు ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించారు. 2015 నుంచి ఈ దినోత్సవాన్ని రెండేళ్లకోసారి జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీర్మానించింది. ఆ రోజున సదస్సులు నిర్వహించి.. ప్రవాసులకు మరింత చేరువకావాలనేది ప్రభుత్వ లక్ష్యం.
  • 18వ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సు 2025, జనవరి 8 - 10 తేదీల్లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. దీని నినాదం: “Diaspora's contribution to a Viksit Bharat” 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎంపీ పట్వారీ, 2017)

Q: ప్రవాస భారతీయ దివస్‌ను ఏ తేదీన నిర్వహిస్తారు?

1) జనవరి 9        2) జనవరి 2          3) జనవరి 5        4) జనవరి 4

సమాధానం: 1

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018)

Q: ప్రవాస భారతీయ దివస్‌ను మొదటిసారి కింది ఏ సంవత్సరంలో నిర్వహించారు?

1) 2001     2) 2002      3) 2003      4) 2004

సమాధానం: 3

(OSSC CGL 2022)

Q: The 17th Pravasi Bharatiya Divas 2023 will be held in which of the following cities?
1) Ahmedabad     2) Indore        3) Jaipur        4) Chandigarh
Answer: 2

(UPSC EPFO 2016)

Q: Which one of the following statements regarding an Overseas Citizen of India (OCI) is not correct?
1) An OCI is a citizen of another country.
2) An OCI possesses multiple-entry long-term visa for visiting India.
3) An OCI is at par with NRIs in all matters
4) An OCI is not entitled to the fundamental right to equality of opportunity in public employment.
Answer: 3

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram