మానవులు చూడటం ద్వారానే చదవడం, నేర్చుకోవడం చేస్తుంటారు. కళ్లతో పదాలను తెలుసుకుని రాస్తుంటారు. మరి అంధులు లేదా దృష్టి లోపం ఉన్నవారి పరిస్థితి ఏంటి? వారు చదువుకోవడం ఎలా? అనే ప్రశ్నలకు సమాధానమే బ్రెయిలీ లిపి. చేతి వేళ్ల స్పర్శతో అక్షరాలను గుర్తించడం దీని ప్రత్యేకత. దీన్ని కనిపెట్టింది ఫ్రెంచ్ విద్యావేత్త అయిన లూయిస్ బ్రెయిలీ. చూపులేని వారి కష్టాలు ఈయనకు స్వయంగా తెలుసు. కాబట్టే వాటిని అధిగమించి, తేలిగ్గా నేర్చుకునేలా ఈ లిపిని రూపొందించారు. అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఆయన జన్మదినమైన జనవరి 4న ‘ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం’గా (World Braille Day) నిర్వహిస్తారు. దృష్టి లోపం ఉన్నవారికి కమ్యూనికేషన్, సాధికారత కల్పించే సాధనంగా బ్రెయిలీ పోషించే పాత్రను చాటి చెప్పడంతోపాటు అంధుల హక్కులను కాపాడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
బ్రెయిలీ లిపి
- బ్రెయిలీ లిపి అనేది ఉబ్బెత్తు చుక్కల స్పర్శ వ్యవస్థ. దీని సాయంతో అంధులు, దృష్టి లోపం ఉన్నవారు తాకడం ద్వారా చదవడం, రాయడం చేయగలరు. అక్షరాలు, సంఖ్యా చిహ్నాలనే కాకుండా సంగీత, గణిత, శాస్త్రీయ అంశాలనూ ఇది సూచిస్తుంది. ఈ చిహ్నాలను బ్రెెయిలీ సెల్స్ అంటారు. ప్రతి సెల్‌లో 1 నుంచి 6 వరకు నిర్ణీత సంఖ్యలో ఎత్తయిన చుక్కలను ఒక క్రమంలో అమర్చడం ఇందులో కీలకాంశం. చుక్కల సంఖ్య, వాటి అమరిక ఒక్కో అక్కరానికి సంకేతాలు.
- ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. బ్రెయిలీ టైప్‌రైటర్లు, ఎలక్ట్రానిక్ బ్రెయిలర్, బ్రెయిలీ నోట్ టేకర్, బ్రెయిలీ ఇన్‌పెల్ కీబోర్డులు లాంటివి అందుబాటులోకి వచ్చాయి. వాటన్నింటికీ బ్రెయిలీ లిపే మూలం.
లూయిస్ బ్రెయిలీ
- ఈయన ఫ్రాన్స్‌లోని పారిస్ నగరానికి దగ్గర్లో ఉన్న క్రూవే గ్రామంలో 1809, జనవరి 4న జన్మించారు. మూడేళ్ల వయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్లను కోల్పోయారు. తల్లిదండ్రులు ఆయన్ను దగ్గర్లోని పాఠశాలలో చేర్పించారు. అయితే అందులో తాను నేర్చుకునేలా సౌకర్యాలు లేకపోవటంతో వేరే స్కూలుకు వెళ్లాలని భావించారు. అప్పుడే ఆయనకు అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ యూత్ గురించి తెలిసింది. దీన్ని 1784లో వాలెంటైన్ హ్యూ పారిస్‌లో ప్రారంభించారు.
- లూయిస్ అందులో చేరి అప్పటికే అమల్లో ఉన్న ‘లైన్ టైప్’ పద్ధతిలో చదువుకున్నారు. ఈ వ్యవస్థను వాలెంటైన్ అభివృద్ధి చేశారు. ఈ లిపి చదవడానికే పనికొచ్చేది కానీ రాయడానికి వీలయ్యేది కాదు. ఉబ్బెత్తు అక్షరాలను ముద్రించటానికి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ అవసరమయ్యేది. దీంతో అంధుల కోసం సరళమైన కొత్త లిపి అవసరమని లూయిస్ గుర్తించారు.
- అదే సమయంలో ఆయనకు మాజీ సైనికాధికారి చార్లెస్ బార్బియర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన అంధులు తేలికగా పుస్తకాలు చదువుకోవడానికి, రాసుకోవడానికి గడిలో ఉబ్బెత్తు అక్షరాలతో కూడిన విధానాన్ని రూపొందించారు. వేలితో చుక్కలను తాకుతూ, వాటిని లెక్కపెట్టుకుంటూ అక్షరాలను ఊహించుకోవడం దీనిలోని కీలకాంశం. దీంతో చదువుకోవడమే కాదు.. వేరే కాగితం మీద గుర్తులనూ పెట్టుకోవడానికి వీలయ్యేది. వీటిని ఇతర అంధులూ చదువుకోవచ్చు.
- దీన్ని మరింత మెరుగుపరచాలని లూయిస్ భావించారు. సులువుగా, అందరికీ ఉపయోగపడేలా మార్చడానికి నిరంతరం ప్రయత్నించారు. ఉబ్బెత్తు చుక్కలతోనే అక్షరాల లిపిని రూపొందించారు. ఇదే బ్రెయిలీ లిపిగా స్థిరపడింది.
చారిత్రక నేపథ్యం
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న చూపులేని వారికి బ్రెయిలీ లిపితో చదువుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి లూయిస్. ఆయన సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఏటా ఆయన పుట్టిన రోజైన జనవరి 4న ‘ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం’గా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2018లో తీర్మానించింది. 2019 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
(ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్, 2025)
Q: ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని మొదటిసారి ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 2017 2) 2018 3) 2018 4) 2020 5) 2021
సమాధానం: 3
(బిహార్ సీఈటీ బీఈడీ, 2018)
Q: బ్రెయిలీ లిపి కింది దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) పాయింట్లు 2) గీతలు 3) ఉబ్బెత్తు 4) ఏదీకాదు
సమాధానం: 1
(CTET, 2014)
Q: In Braille script, rows of raised dots are made on a thick paper. This script is based on...
1) 4 points 2) 6 points 3) 8 points 4) 10 points
Answer: 2