సుపరిపాలన దినోత్సవం

సుపరిపాలన దినోత్సవం

దేశంలో లేదా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నా, ప్రజలు సుఖ-శాంతులతో జీవించాలన్నా సమర్థవంతమైన పాలన అవసరం. దీని ద్వారానే పౌరులు మెరుగైన సేవలు పొందగలుగుతారు. ప్రజా వ్యవహారాల నిర్వహణలో నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం, పర్యవేక్షించడం లాంటివి పాలన సూచిస్తుంది. స్థిరమైన అభివృద్ధి, సామాజిక న్యాయం, పౌరుల సాధికారతకు ఇది అవసరం. ప్రభుత్వ జవాబుదారీతనం, సమర్థవంతమైన పరిపాలన గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా డిసెంబరు 25న మన దేశంలో సుపరిపాలన దినోత్సవాన్ని (Good Governance Day) నిర్వహిస్తారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. ప్రభుత్వ బాధ్యతలు, విధుల, అభివృద్ధి ఆధారిత పాలన గురించి పౌరులను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పాలన అంటే?

  • దేశ సమగ్రతను కాపాడుతూ; పౌరులందరి భద్రతను, రాజ్యాంగ నియమాలను పరిరక్షిస్తూ, విద్య - ఆరోగ్యం - ఉపాధి - ఆహారభద్రత మొదలైన సేవలను అందించే నిర్ణయీకరణ ప్రక్రియనే గవర్నెన్స్‌గా పేర్కొంటారు. నిర్ణయీకరణ ప్రక్రియ అమలు చేస్తున్న ప్రతి వ్యవస్థలోను గవర్నెన్స్‌ ఉంటుంది.
  • ప్రపంచంలోని అనేక దేశాలు తమ పాలనలో ఆధునికీకరణ, నూతన ప్రభుత్వ నిర్వహణ అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. దీంతో ‘పాలన’ స్థానంలో ‘సుపరిపాలన’ అనే భావన అమల్లోకి వచ్చింది. 
  • సుపరిపాలనలో ప్రభుత్వం తనకున్న అధికారాలను ఉపయోగించి.. ఆర్థిక వనరులను సమాజాభివృద్ధికి వినియోగిస్తూ, తక్కువ అధికారాన్ని చెలాయిస్తూ ఎక్కువ అభివృద్ధికి కృషి చేస్తుంది. 

భారత్‌లో సుపరిపాలన

  • 1991లో పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ప్రభుత్వ రంగాన్ని పరిమితం చేసి, ప్రైవేట్‌ రంగానికి అవకాశాలను కల్పించారు. తద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు.
  • అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో న్యూదిల్లీలో ‘సెంటర్‌ ఫర్‌ ఈ - గవర్నెన్స్‌’ను నెలకొల్పింది.

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

  • ఈయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న జన్మించారు. జన్‌సంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడైన శ్యామాప్రసాద్‌ ముఖర్జీకి రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు.
  • 1939లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)లో చేరారు. 1944 నాటికి ఆర్య కుమార్‌ సభకు ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్‌ కార్యదర్శి బాధ్యతలను వాజ్‌పేయీ చేపట్టారు. 1968 నుంచి 1972 వరకూ జనసంఘ్‌ అధ్యక్షుడిగా సేవలందించారు.
  • 1977లో జనతా పార్టీలో జనసంఘ్‌ విలీనమయ్యాక, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • జనతా పార్టీ చీలిపోయాక 1980లో అడ్వాణీతో కలిసి భాజపాను స్థాపించారు. ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1996 ఎన్నికల్లో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 
  • 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ భాజపా అధికారం చేపట్టగా వాజ్‌పేయీ ప్రధాని అయ్యారు. మద్దతిచ్చిన ఏఐఏండీఎంకే 13 నెలల తర్వాత ఉపసంహరించుకోవడంతో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది. 
  • 1999లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 303 సీట్లను గెలుచుకుని అధికారం చేపట్టింది. వాజ్‌పేయీ మూడోసారి ప్రధాని అయ్యారు. దీంతో అయిదేళ్లపాటు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగింది.
  • 2018, ఆగస్టు 16న న్యూ దిల్లీలో మరణించారు.

చారిత్రక నేపథ్యం

  • అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న కాలంలో సమ్మిళిత వృద్ధి, ప్రభావవంతమైన పరిపాలనపై ఎక్కువగా దృష్టిసారించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014, డిసెంబరు 23న ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. అలాగే ఆయన జన్మదినమైన డిసెంబరు 25న ఏటా ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తామని ప్రకటించింది. 2014 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020), (ఎస్‌ఎస్‌సీ జేఈ ఈఈ, 2020)

Q: కింది ఎవరి జయంతి సందర్భంగా ఏటా డిసెంబరు 25న మన దేశంలో ‘సుపరిపాలన దినోత్సవాన్ని’ జరుపుతున్నారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ        2) రాజీవ్‌ గాంధీ

3) పి.వి.నరసింహారావు            4) అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

సమాధానం: 4

(ఎంపీసీఎస్సీ జీఎస్, 2014)

Q: భారతీయ జనతా పార్టీ (భాజపా) స్థాపన తర్వాత ఎవరు దానికి మొదటి అధ్యక్షులు అయ్యారు?

1) ఎల్‌కే అడ్వాణీ            2) అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

3) ఎం.ఎం.జోషి            4) ప్రమోద్‌ మహాజన్‌

సమాధానం: 2

(MPSC 2015 Prelims Paper 1)

Q: Consider the following statements regarding Atal Bihari Vajpayee:
a. He was the Prime Minister of India from 1996 to 2004, three times.
b. He was a member of the Lok Sabha eight times and Rajya Sabha thrice.
Which of the statements given above is/are correct? 
1) a only                2) b only
3) both a and b            4) Neither a nor b
Answer: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram