వ్యక్తిగత, సామాజిక, కుటుంబ అవసరాల కోసం వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని వినియోగదారుడు అంటారు. ప్రతి పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేసే వస్తువు లేదా సేవ అంతిమంగా వినియోగదారుకు చేరాలనే ఉద్దేశంతోనే ఆయా సంస్థలు పనిచేస్తుంటాయి. వీరు లేకపోతే కంపెనీలకు మనుగడే ఉండదు. వినియోగదారులకు నాణ్యమైన వస్తు, సేవలు అందించడం సంస్థల ప్రాథమిక విధి. అయితే వివిధ కంపెనీలు మోసపూరిత ధోరణితో కన్స్యూమర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఏటా డిసెంబరు 24న ‘జాతీయ వినియోగదారుల దినోత్సవం’గా (National Consumer Day) నిర్వహిస్తారు. దీన్నే ‘జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం’ (National Consumer Rights Day) అని కూడా అంటారు. వినియోగదారుల రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
వినియోగదారుడు అంటే?
- తన వ్యక్తిగత ఉపయోగం కోసం డబ్బు చెల్లించడం ద్వారా ఏవైనా వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని వినియోగదారుడు అంటారు. వీరే ఆ వస్తు లేదా సేవలకు అంతిమ కొనుగోలుదారు అవుతారు. వినియోగదారు వ్యక్తుల సమూహం కూడా కావొచ్చు.
భారతదేశంలో వినియోగదారుల హక్కులు
- మన దేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రతి కస్టమర్‌కు ఆరు ప్రాథమిక హక్కులను అందిస్తుంది. ఇవి సంబంధిత వ్యక్తి న్యాయంగా వ్యవహరించేలా, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఆ హక్కులను పరిశీలిస్తే..
1. భద్రత పొందే హక్కు
2. సమాచారం పొందే హక్కు
3. ఎంచుకునే హక్కు
4. విన్నవించుకునే హక్కు
5. పరిష్కారాన్ని కోరే హక్కు
6. వినియోగదారుల విద్య హక్కు
వినియోగదారుల రక్షణ చర్యలు
- వినియోగదారుల హక్కులను బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రక్షణ చర్యలు చేపట్టింది.
- సీసీపీఏ: కస్టమర్ల హక్కుల ఉల్లంఘనలను పరిశీలించేందుకు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ)ని నెలకొల్పారు. దీన్ని వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 10 ప్రకారం స్థాపించారు. 2020, జులై 20 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
- సీసీపీఏ అనేది వినియోగదారుల హక్కులను రక్షించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది.
- అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధిస్తుంది, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలను అడ్డుకుంటుంది.
- వినియోగదారుల రక్షణ చట్టం, 1986: వివిధ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల మండళ్ల ఏర్పాటు, అధికారుల నియామకం.
- ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006: ఆహార భద్రతను నిర్ధారిస్తుంది, ఆహార ప్రమాణాలను నియంత్రిస్తుంది.
- లీగల్ మెట్రాలజీ చట్టం, 2009: న్యాయపరమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారిస్తుంది. తూనికలు, కొలతలు, ఉత్పత్తులకు ప్రమాణాలు ఏర్పాటు చేస్తుంది.
- వినియోగదారుల రక్షణ చట్టం, 2019: వినియోగదారుల రక్షణ చట్టం, 1986ను నవీనీకరించి దీన్ని తీసుకొచ్చారు.
చారిత్రక నేపథ్యం
- భారతదేశంలో అత్యంత ముఖ్యమైన చట్టాల్లో వినియోగదారుల రక్షణ చట్టం 1986 ఒకటి. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, లోపభూయిష్ట వస్తువులు, నాణ్యత లేని సేవల నుంచి వినియోగదారుడిని రక్షించడం దీని లక్ష్యం. దీని అమలుకు ముందు మన దేశంలో వినియోగదారుల సమస్యలకు సరైన పరిష్కారం లేదు. విక్రేతల దోపిడీ అధికంగా ఉండేది. ఈ చట్టం వచ్చాక ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం అయ్యింది.
- ఈ చట్టాన్ని భారతదేశంలో వినియోగదారుల హక్కుల మాగ్నా కార్టా అని పిలుస్తారు. ఇది 1986, డిసెంబరు 24న మన దేశంలో అమల్లోకి వచ్చింది. భారత్‌లోని వినియోగదారుల హక్కుల్లో నిర్మాణాత్మక మార్పు తీసుకొచ్చిన ఈ చట్టం అమలైన తేదీని ఏటా ‘జాతీయ వినియోగదారుల దినోత్సవం’గా జరపాలని 2019లో భారత ప్రభుత్వం ప్రకటించింది. 2020 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని మన దేశంలో ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2021)
1) నవంబరు 24 2) మార్చి 13
3) అక్టోబరు 2 4) డిసెంబరు 24
సమాధానం: 4
ప్రశ్న: మన దేశంలో నూతన వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (హెచ్‌టెట్ టీజీటీ, 2020)
1) 1976
2) 2020
3) 1996
4) 2006
సమాధానం: 2
Q: With reference to consumer's rights/privileges under the provisions of the law in India, which of the following statements is/are correct?
i. Consumers are empowered to take samples for food testing.
ii. When a consumer files a complaint in any consumer forum, no fee is required to be paid.
iii. In case of the death of a consumer, his/her legal heir can file a complaint in the consumer forum on his/her behalf.
Select the correct answer using the codes given below:
(UPSC Civil Services Exam 2012 Prelims)
1) i only 2) ii and iii only
3) i and iii only 4) i, ii and iii
Answer: 3