సమాజంలో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధులకు, మరణాలకు కాలుష్యమే ప్రధాన కారణం. ప్రధాన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం మన దేశంలో ఏటా డిసెంబరు 2న ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా (National Pollution Control Day) నిర్వహిస్తారు. పర్యావరణానికి నష్టం కలిగించే తీవ్రమైన కాలుష్య కారకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు పారిశ్రామిక విపత్తుల నివారణకు అనుసరించాల్సిన చర్యల అవసరాన్ని చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- కాలుష్యానికి ముఖ్య కారణం జనాభా పెరుగుదలే. ఉత్పత్తి, వినియోగ కార్యకలాపాల వల్ల వచ్చే అనేక రకాల వ్యర్థాలు పర్యావరణంలోని వివిధ ఆవరణ వ్యవస్థల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా నీరు, నేల, గాలి కలుషితమవుతున్నాయి. అంతిమంగా ఆ ప్రభావం జీవకోటిపై పడుతోంది.
- కాలుష్యానికి కారణమైన వాటిని కాలుష్య కారకాలు అంటారు. చెత్త లాంటి వ్యర్థాలు; సీసం, పాదరసం, జింక్ లాంటి మూలకాలు; సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియం, ఫ్లోరిన్, క్లోరిన్ లాంటి వాయువులు; క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు, రేడియోధార్మిక పదార్థాలు, అధిక శబ్దం - ఉష్ణం మొదలైనవన్నీ దీనికి ఉదాహరణలు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)
- దిల్లీలోని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) 2025, నవంబరు 24న ఆయా నగరాల్లో వాయు నాణ్యత ఆధారంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ను విడుదల చేసింది.
- ఏక్యూఐలో 0 - 50 పాయింట్లు పొందిన నగరాలను మంచి కేటగిరీలో, 50 - 100: సంతృప్తికర, 101 - 200: మధ్యస్తంగా కలుషితమైన, 201 - 300: పేలవమైన, 301 - 400: చాలా పేలవమైన, 401 - 500: తీవ్రమైన కాలుష్యం కలిగిన నగరాలుగా వర్గీకరించింది.
కాలుష్య నివారణ చర్యలు
- మన దేశంలో కాలుష్యాన్ని నివారించడానికి, నియంత్రించడానికి భారత ప్రభుత్వం వివిధ చట్టాలు, నియమాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనవి:
- ది వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) యాక్ట్ 1974
- ది వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) సెస్ యాక్ట్ 1977
- ది ఫారెస్ట్ (కన్జర్వేషన్) యాక్ట్ 1980
- ది ఎయిర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) యాక్ట్ 1981
- ది ఎన్విరాన్మెంట్ (ప్రొటెక్షన్) రూల్స్ 1986
- ది ఎన్విరాన్మెంట్ (ప్రొటెక్షన్) యాక్ట్
చారిత్రక నేపథ్యం
- 1984 డిసెంబరు 2, 3 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారంలోని ట్యాంకు నుంచి 40-45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) వాయువు లీకైంది. ఈ ప్రమాదం కారణంగా ప్రభావితులైన ప్రజలను స్మరించుకునే ఉద్దేశంతో మన దేశంలో ఏటా డిసెంబరు 2న ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా జరుపుతున్నారు. కాలుష్యం, పారిశ్రామిక భద్రత గురించి అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
(ఎంపీ పట్వారీ గ్రూప్-2, 2022)
Q: భారత్‌లో ఏటా ఏ తేదీన కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
1) డిసెంబరు 22 2) డిసెంబరు 20
3) డిసెంబరు 2 4) డిసెంబరు 12
సమాధానం: 3
(UPTET 2018 Paper-1)
Q: The Bhopal Gas Tragedy of 1984 was due to the leakage of which of the following gases?
1) Methyl isocyanate
2) Nitrous oxide
3) Methane
4) Carbon monoxide
Answer: 1