ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం

ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం

ఎక్వైర్డ్‌ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌ (ఎయిడ్స్‌) అనేది హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్‌ (హెచ్‌ఐవీ) వల్ల సంభవిస్తుంది. హెచ్‌ఐవీ మానవ శరీరంలోకి ప్రవేశించగానే ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా హెచ్‌ఐవీ సోకాక ప్రారంభంలో గుర్తించకుండా.. అలాగే దీర్ఘకాలం వదిలేస్తే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రాణంతక వ్యాధిని నివారించడానికి ఎలాంటి మందు లేదు. కేవలం ముందు జాగ్రత్త చర్యల ద్వారానే దీన్ని అరికట్టొచ్చు. ఎయిడ్స్‌ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 1న ‘ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం’ (World AIDS Day) గా నిర్వహిస్తారు. హెచ్‌ఐవీ సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడంతోపాటు వ్యాధిగ్రస్థుల సంరక్షణ, వారి హక్కులను కాపాడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

సంక్రమణ - వ్యాప్తి 

  • హెచ్‌ఐవీ ప్రధానంగా రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో భాగమైన సీడీ4 అనే కణాలను నాశనం చేస్తుంది. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తూ అనారోగ్యాల నుంచి మానవుడ్ని రక్షిస్తాయి. 
  • హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ సంక్రమించిన వారితో అరక్షిత శృంగారంలో పాల్గొనడం, వారి రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం, వ్యాధిగ్రస్థులకు వాడిన సిరంజీలను వేరేవారికి ఉపయోగించడం లాంటివి వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి. 
  • ఒకసారి హెచ్‌ఐవీ మానవ శరీరంలోకి ప్రవేశించాక.. దాన్ని అంతం చేయడం అసాధ్యం. అయితే యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్‌టీ) ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిపై ఇది జరిపే దాడిని ఆపొచ్చు. దీనిద్వారా వ్యక్తులు దీర్ఘకాలం ఆరోగ్యకర జీవనాన్ని గడిపే అవకాశం ఉంది. 
  • ఈ వైరస్‌ బారినపడినవారితో కలిసి భోజనం చేసినా, వాళ్లని తాకినా అది వ్యాప్తి చెందదు. గర్భిణి ద్వారా పుట్టబోయే శిశువుకూ ఇది సంక్రమిస్తుంది. తల్లిపాల ద్వారానూ ఇది సంక్రమిస్తుంది. గర్భం ధరించాక వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల మందులు వాడటం ద్వారా బిడ్డకు రాకుండా కాపాడొచ్చు. 

ముఖ్యాంశాలు

  • హైచ్‌ఐవీ వైరస్‌ రిట్రో విరిడే అనే కుటుంబానికి చెందింది. ఇందులోని ఆర్‌ఎన్‌ఏ ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్టేజ్‌’ అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది. హెచ్‌ఐవీ వైరస్‌ తరచూ తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే నివారణ మందు తయారుచేయడం కష్టంగా మారింది.
  • హెచ్‌ఐవీని 1983లో ఫ్రాన్స్‌కి చెందిన ల్యూక్‌ మాంటెగ్నర్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. 
  • 1984లో అమెరికాకు చెందిన రాబర్ట్‌ గాలో అనే శాస్త్రవేత్త కూడా ఇదే వైరస్‌ను కనిపెట్టాడు. దీనికి ఆయన Human TnCell Lympotropic Virus -III (HTLV-III) అని పేరు పెట్టారు.

చారిత్రక నేపథ్యం:

హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)లో పనిచేసే జేమ్స్‌ డబ్ల్యూ బన్, థామస్‌ నెట్టర్‌ 1987లో గ్లోబల్‌ ప్రోగ్రాం ఆన్‌ ఎయిడ్స్‌ అనే కార్యక్రమాన్ని (ప్రస్తుతం దీన్ని యూఎన్‌ఎయిడ్‌గా పిలుస్తున్నారు) రూపొందించారు. దీనిపై మరింత విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో 1988 నుంచి ఏటా డిసెంబరు 1న ‘ప్రపంచ ఎయిడ్స్‌ డే’గా నిర్వహించాలని తీర్మానించారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(బీపీఎస్‌సీ 64 సీసీఈ ప్రిలిమ్స్, 2018)

Q: ఎయిడ్స్‌ వ్యాధి దేని వల్ల సంభవిస్తుంది?

1) నీరు        2) బ్యాక్టీరియా          3) వైరస్‌           4) ఫంగస్‌

సమాధానం: 3

(MP Police SI, 2016)

Q: World AIDS day is celebrated on_______.
1) December 5         2) November 1        3) December 1         4) June 11
Answer: 3

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram