స్వాతంత్య్రానంతరం అనేక స్వదేశీ సంస్థానాలు మన దేశంలో విలీనమై.. పూర్తిగా భారత యూనియన్‌లో భాగంగా మారాయి. వాటిలో జమ్మూకశ్మీర్ కూడా ఒకటి. అయితే భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా ఆ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. తద్వారా కొన్ని ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమల్లో ఉంటాయి. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్‌లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2019, ఆగస్టు 5న రద్దు చేసింది. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలను పరిశీలిద్దాం.
కశ్మీర్‌కు ప్రత్యేక హోదా:
1949 అక్టోబర్ 17న రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్‌సింగ్ ఉన్న సమయంలో కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యాంగంలో 370 అధికరణను చేర్చింది. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది. 1956లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే దీన్ని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది.
• నాటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370 ప్రధాన రూపకర్త. 1937-43 కాలంలో జమ్మూకశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.
• ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా కశ్మీర్‌కు ఇచ్చిన స్వయంప్రతిపత్తిని రద్దు చేసే అధికారం ఉంది. దీని ప్రకారమే ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ అధికరణను రద్దు చేసింది. అంతేకాక ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
• ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు 2023, డిసెంబరు 11న స్పష్టం చేసింది.